కాంగ్రెస్‌ను కాపాడుతున్న స్పీకర్లు

Narayana Molleti
 దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలుతున్న కాంగ్రెస్‌ పార్టీని కాపాడుతున్నది ఎవరు. సంకీర్ణశకంలో కాంగ్రెస్‌ పార్టీని మిత్రపక్షాలు కాపాడుతున్నాయని అనుకుంటే పొరపాటే. ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీని కాపాడుతున్నది లోక్‌సభ, అసెంబ్లీ స్పీకర్లే అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముందుగా కేంద్రం విషయానికి వస్తే.. ఇటీవల సొంత పార్టీ ఎమ్మెల్యేలు సహా పలు పార్టీలు అవిశ్వాస తీర్మానానికి పట్టుబట్టాయి. సాధారణంగా ఇలాంటి సమయంలో అవిశ్వాసం చర్చకు వస్తే కాంగ్రెస్‌కు భంగపాటు తప్పని పరిస్థితి నెలకొంది. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం తెలివిగా స్పీకర్‌ మీరాకుమార్‌తో అవిశ్వాస అస్త్రాలను నిర్వీర్యం చేయించింది. పైకి లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగినట్టు కనిపించినా.. అంతర్గతంగా మాత్రం ఇదంతా కాంగ్రెస్‌ గేమ్‌ ప్లాన్ అని విశ్లేషకలు గట్టిగా నమ్ముతున్నారు. ఇక రాష్ట్రం విషయానికొస్తే ఇక్కడా ఇంచుమించు అదే పరిస్థితి. అయితే ఇక్కడ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు లేకపోయినా.. కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎంతో సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ బిల్లు రాష్ట్ర అసెంబ్లీని దాటించాలంటే కీలక పాత్ర పోషించాల్సింది స్పీకరే. సాధారణంగా అసెంబ్లీలో ఇలాంటి బిల్లులను ముఖ్యమంత్రులు గట్టెక్కించాల్సి ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండటంతో ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి స్పీకర్‌ నాదెండ్ల మనోహరే అపద్భాందవుడయ్యాడు. ఇంకా చెప్పాలంటే అధిష్టానం అండదండలు పుష్కలంగా ఉన్న స్పీకర్ ఇప్పుడు సీఎం కిరణ్‌తో ఢీ అంటే ఢీ అంటున్నాడు. విభజన బిల్లు అసెంబ్లీని దాటించేందుకు తనకున్న అధికారులన్నింటినీ స్పీకర్‌ ఉపయోగించే అవకాశం ఉందని తెలుస్తోంది.  ఇలా ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో స్పీకర్లే ఆయా ప్రభుత్వాలకు రక్షణ కవచంలా మారిన పరిస్థితి రాజకీయాల్లో నైతిక విలువలు ఎంత దిగజారాయో తెలియజేస్తున్నాయి. కొందరు రాజకీయ పరిశీలకుల విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం లోక్‌సభలో మీరాకుమార్‌కు బదులు.. సోమ్‌నాథ్‌ చటర్జీ వంటి వ్యక్తి స్పీకర్‌ కుర్చీలో ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఆయా కుర్చీల్లో ఉన్న వారు ఫక్తు కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు కావడంతో కాంగ్రెస్‌ పార్టీ యధేచ్చగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: