ఎపుడు పడితే అపుడా... ఇది సినిమానా పవన్...!?

Satya

పవన్ కళ్యాణ్ సినిమా నటుడు. ఇప్పటికీ ఆయన ఆ ముద్రను చెరిపేసుకోలేకపోతున్నారు. అన్నం ఉడకడానికి కొంత టైం ఉంటుంది. మనిషి దాన్ని తినడానికి కొంత టైం పడుతుంది. అలాంటిది పవన్ చెబుతున్న సమస్యలు ఇవాళా నిన్నా కావు, ఏళ్ళ తరబడి ఉన్నాయి. పైగా కొన్ని సమస్యలు  మానవజాతి ఆవిర్భావం నుంచి కూడా  ఉన్నాయి. ఇక జాతీయ స్థాయిలో ఉన్న సమస్యలను సైతం పట్టుకువచ్చి జగన్ని పవన్ టార్గెట్ చేయడం అంటే ఆయన పూర్తిగా అసూయతోనే మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.

 

తిరుపతిలో రైతుబజార్ని సందర్శించిన పవన్ అక్కడ ఉల్లిగడ్డల కోసం క్యూలో ఉన్న వారిని చూశారు, ఉల్లి రేటు తెలుసుకున్నారు. అంతే మీడియా ముందుకు వచ్చి తనదైన శైలిలో రెచ్చిపోయారు. ఉల్లి కొరత జగన్ వల్లే వచ్చిందన్నట్లుగా మాట్లాడారు. సమస్యలు తీర్చలేకపోతే ఎన్నికలకు మళ్ళీ వెళ్ళాలంటూ సూచన ఇచ్చేశారు.

 

నిజానికి ఉల్లి దిగుబడి తగ్గిపోయింది. దేశంలో  ప్రతీ చోటా ఉల్లి కొరత ఉంది. బీహార్ లాంటి రాష్ట్రాల్లో అయితే ఉల్లి బస్తాల దొంగతనాలు జరుగుతున్నాయి. కేంద్రం సైతం విదేశాల నుంచి ఉల్లికి తీసుకువచ్చి సరఫరా పెంచుతామని చెబుతోంది. భారీ వరదలు రావడం వల్ల ఉల్లి పంట కొట్టుకుపోయింది. దానికి జగన్ సర్కార్ ఏం చేస్తుందన్నది వైసీపీ నేతల ప్రశ్న.

 

మరో వైపు పవన్ తెలంగాణాలోని దిశ అత్యాచారాన్ని, దారుణ  హత్యను  తీసుకువచ్చి జగన్ పాలనలో మహిళా రక్షణ లేదంటున్నారు. రెండేళ్ళ క్రితం రాయల సీమలో జరిగిన  ఒక బాలిక హత్యాచారంపై నాడు బాబు పాలనలో  మౌనంగా ఉండి ఇపుడు జగన్ సర్కార్ మీద విరుచుకుపడుతున్నారు. దేనికో దానికి ముడి పెట్టి జగన్ని తిట్టడమేనా నా పవన్ నీ పని అంటున్నారు వైసీపీ నేతలు.

 

మళ్ళీ ఎన్నికలు కావాలని పవన్ అంటున్నా ఎన్నికలు అయిదేళ్ళకు ఒకసారి జరుగుతాయి తప్ప పవన్ కోరుకున్నట్లుగా జరగడానికి ఇది సినిమా తీయడం కాదని సెటైర్లు వేస్తున్నారు. మరో వైపు పవన్ అన్న మాటలోనే లాజిక్ చూస్తే ప్రతి ప్రభుత్వంలో కొన్ని సమస్యలు ఉంటాయి. అవి పరిష్కరించే ప్రయత్నం చేస్తారు, ఒకవేళ జరగకపోతే ప్రతీ సమస్యకూ ఎన్నికలకు వెళ్ళడమేనా పరిష్కారం ఇదేనా పవన్ చెబుతున్న కొత్త రాజకీయం అని కూడా అంటున్నారు.

 

ఇక దేశంలో మోడీ అధికారంలోకి తొలిసారి వచ్చినపుడు విదేశీ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఖాతాలో వేస్తామని చెప్పారు. అలాగే ఏడాదికి కోటి ఉద్యోగాలు అన్నారు, మరి అవి ఇప్పటికీ తీరలేదు, మళ్ళీ మోడీ ఎన్నికలకు వెళ్ళమని చెప్పే ధైర్యం పవన్ కి  ఉందా అని కూడా అంటున్నారు. మొత్తానికి చూడబోతే పవన్ బయటకు వచ్చింది,టూర్లు చేస్తున్నది జగన్ని తిట్టడానికేనని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: