పవన్ కు రాజాసింగ్ వార్నింగ్.. ఇంతకీ హిందూ మతంపై పవన్ ఏమన్నాడు..?

Chakravarthi Kalyan

హిందూ మతంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అనేక విమర్శలకు ఆస్కారం కల్పిస్తున్నాయి. హిందూ సంఘాలు, రాజాసింగ్ వంటి నేతలు పవన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. అసలు ఇంతకీ పవన్ ఏమన్నాడు.. హిందూ మతం గురించి ఏమని కామెంట్ చేశాడు.. ఓసారి చూద్దాం..

 

సోమవారం పవన్‌ కల్యాణ్‌ తిరుపతిలో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడారు. మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నేతలే అని ఘటుగా కామెంట్ చేశారు. మతాల మధ్య గొడవపెట్టేది హిందూ నాయకులేనని పవన్‌ ఆరోపించారు. ఇతర మతాల నేతలు ఇలాంటి పనులు చేయరని అన్నారు. అంతే కాదు.. టీటీడీలో అన్యమత ప్రచారం చేయిస్తోంది హిందువులేనని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

అసలు హిందూ నాయకుల ప్రేరణ లేనిదే ఇలాంటివి జరగవని పవన్ కల్యాణ్ అన్నారు. తాను చిన్నప్పటి నుంచి వింటోంది ఒకటేనని..సెక్యులరిజాన్ని ఇబ్బంది పెడుతోంది హిందూవులు మాత్రమేనని పవన్ కామెంట్ చేశారు. మిగతా మతాల వారు ఇలాంటి పనులు చేయరని చెప్పారు. అయితే ఈ విషయాన్ని జగన్ కు చెందిన సాక్షి మీడియా బాగా హైలెట్ చేసింది.

 

మిగిలిన మీడియా పెద్దగా పట్టించుకోకపోయినా.. సాక్షి మాత్రం కుమ్మేసింది. దీంతో హిందూ వర్గం నుంచి ఎటాక్ మొదలైంది. సహజంగానే హిందూ విషయాల్లో దూకుడుగా ఉండే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పవన్ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. హిందూమతం, ధర్మం గురించి కనీస అవగాహన లేకుండా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని రాజాసింగ్ విమర్శించారు.

 

ఇంతకీ.. పవన్‌ ఏ మతానికి చెందిన వారని, ఇతర మతానికి మారిపోయారా? అని ప్రశ్నించారు.
పవన్‌ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. లేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని, ఖబర్దార్ పవన్‌ అని వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: