పవన్ కామెంట్లు దేనికి సంకేతం !
ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? అమిత్ షాను పొగుడుతూ పవన్ చేసిన కామెంట్లు దేనికి సంకేతం? జరుగబోయే పరిణామాలకు ఈ వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తాయా? ప్రస్తుతం ఇదే చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ ఈ తరహాలో కామెంట్ చేసిన వెంటనే వైసీపీ నేతలు ఇదంతా విలీన ప్రక్రియలో భాగమేనంటూ చేసిన కామెంట్లు.. ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త తరం రాజకీయాలకు అంకురార్పణ జరగనుందా? అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. అమిత్ షాను పొగుడుతూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లతో ఏపీ రాజకీయం రంజుగా మారింది. కొన్ని రోజుల నుంచి జనసేనాని...బీజేపీకి దగ్గర కాబోతున్నారనే చర్చ జరుగుతోన్న క్రమంలో అమిత్ షాను ఉద్దేశించి.. అమిత్ షా లాంటి నాయకుడు ఉండాల్సిన అవసరం ఉందంటూ చేసిన కామెంట్ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్కుగా మారింది.
ఇక... ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కామెంట్లపై వైఎస్సార్సీపీ సీరియస్ గా రియాక్ట్ అయింది. జనసేనను.. బీజేపీలో విలీనం చేసేందుకే పవన్ కళ్యాణ్ ఈ తరహా కామెంట్ చేశారంటూ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని ఆసక్తికర కామెంట్లు చేశారు. విలీనం చేసే ఉద్దేశ్యం లేకుంటే పవన్ కళ్యాణ్ ఈ తరహాలో అమిత్ షాను ఎందుకు పొగుడుతారంటూ ప్రశ్నిస్తున్నారు మంత్రులు. జనసేనను బీజేపీలో విలీనం చేసేయాలంటూ అమిత్ షా తనను అడిగారని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు మంత్రులు.
అయితే మంత్రుల వ్యాఖ్యలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. తాను ఆశయాలను వదిలేస్తే వైసీపీ ఏమయ్యేదని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ దగ్గరకు వెళ్ళి ప్రత్యేక హోదాలో మిమ్మల్ని నొప్పించాను.. అని చేతుల కలిపితే వైసీపీ బయటకు వచ్చేదా అని అన్నారు పవన్. ముప్పైవేల కోట్లు పంచి కూడా చంద్రబాబు ఒడిపోయారని అన్నారు. మంగళగిరిలో తన సభతో టిడిపి ఓటమి డిసైడ్ అయ్యిందని గుర్తు చేశారు. ఇంకా తిట్టి ఏం లాభం అని తిట్టలేదన్నారు. సినిమాల్లో తక్కువ మాట్లాడుతాను... నిజ జీవితంలోనే ఎక్కువ మాట్లాడుతానని తెలిపారు పవన్ కల్యాణ్.
2019 ఎన్నికల తర్వాత జనసేనాని తీరులో మార్పు వచ్చిందనే చర్చ జోరుగా సాగింది. బీజేపీకి దగ్గరయ్యేలా పవన్ తెర వెనుక వ్యూహం రచిస్తున్నారనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి మాస్ ఇమేజ్.. క్రౌడ్ పుల్లింగ్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ తో కలిసి వెళ్లే దిశగా బీజేపీ పావులు కదుపుతోందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల పవన్ ఢిల్లీ పర్యటన కొంత చర్చనీయాంశం అయింది. ఢిల్లీ వెళ్లిన పవన్ ఎవర్ని కలిశారనే క్లారిటీ లేకపోవడంతో అక్కడ ఏం జరగలేదనే భావన ఏర్పడింది. మొత్తానికి....పవన్ కళ్యాణ్ కామెంట్లు ఏపీలో రాజకీయంగా ఆసక్తికర చర్చకు తెర లేపే సూచనలు కన్పిస్తున్నాయి.