ఆయన అక్కడ-ఈయన ఇక్కడ:సీఎం, పీసీసీ మధ్య మరింత పెరిగిన అగాధం?

 హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి-పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణల మధ్య అగాధం మరింత పెరిగిందా? అంటే తాజా పరిణామాలు దగ్గరగా చూస్తున్న వారికెవరికైనా ఔననే అనిపిస్తోంది. వీరిద్దరి ఆధిపత్య పోరులో క్యాడర్ కొట్టుమిట్టాడుతోంది. తాజాగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను, మహారాష్ర్టలో జరిగిన రాష్ట్రానికి చెందిన ప్రయివేట్ బస్ ఘోర రోడ్డు ప్రమాదాన్ని పరిశీలిస్తే చాలు ఇద్దరి మధ్యన ఎంత గ్యాప్ వుందో ఇట్లే అర్థమవుతోంది.  రాష్ర్టంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. మహారాష్ర్టలో జరిగన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 32మంది దుర్మరణం చెందారు. ఈ రెండు సంఘటనల లోతుగా పరిశీలిస్తే... సీఎం, పీసీసీ మధ్య ఇంకా సయోధ్య కుదరలేదనీ, ఎన్నికల సందర్భంగా వారిద్దరూ ‘ఒక్కటి’గా ఉన్నట్లు నటించారని తేటతెల్లమవుతోంది. రాష్ర్ట చరిత్రలోనే అత్యంత ఖరీదైన, ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది.  దీనిపై ఇప్పటి వరకు పీసీసీ-సీఎం ఒక దగ్గర కూర్చోని పోస్టుమార్టం నిర్వహించలేదు. ఫలితాలపై ముఖ్యమంత్రి కిరణ్ తనకు అందుబాటులో ఉన్న ఇద్దరుముగ్గురు మంత్రులతో మాత్రమే చర్చించారు. అది సీఎం క్యాంపు కార్యాలయంలో. ఉప ఎన్నికల ఫలితాలకు సంబందించి ఇప్పటి వరకు సీఎం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.  ఫలితాలకు తాను కానీ, పీసీసీ కానీ, ఇతర నాయకులు బాధ్యులమనీ ఎక్కడా చెప్పలేదు. ఇక పీసీసీ చీఫ్ విషయానికి వస్తే...ఉప ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు రాకపోవడానికి పెంచిన పెట్రోలు, నిత్యావసర ధరలతో ప్రజలు కొంత ప్రభుత్వంపై అసంత్రుప్తితో ఉండటం కారణంగా చెప్పుకొచ్చారు. పీసీసీ మాటలను బట్టి ఉప ఎన్నికల్లో పార్టీ పరాజయానికి ప్రభుత్వమే కారణమని చెప్పకనే చెప్పారు. ఈయన గాంధీభవన్ దాటి వెళ్లడం లేదు.  దీన్ని బట్టి కూడా పీసీసీ-సీఎం మధ్యన ఎలాంటి సయోధ్య వుందో వేరే చెప్పనక్కర్లేదు. ఇక ఈ నెల 16న షిర్డీ వెళ్లుతూ రాష్ర్టానికి చెందిన ట్రావెల్ బస్ మహారాష్ట్ర్రలోని ఉస్మానాబాద్ దగ్గర లోయలో పడి 30 మందికి పైగా చనిపోయారు. చనిపోయిన వారంతా రాష్ర్టానికి చెందిన వారే. ప్రమాద సంఘటన విషయంలో సీఎం కిరణ్ సచివాలయంలో తనకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్, మంత్రి శ్రీధర్ బాబు, మిగత కొంత మంది అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.  తక్షణమే తగు చర్యలు తీసుకోవాలనీ అధికారులను ఆదేశించడంతో పాటు శాఖాపరంగా ఎలాంటి సంబందంలేని మంత్రి శ్రీధర్ బాబును ప్రత్యేక హెలికాప్టర్లో ప్రమాద స్థలానికి పంపించారు. ఇక పీసీసీ చీఫ్, ట్రాన్స్ ఫోర్టు మంత్రి కూడా అయిన సత్తిబాబు మాత్రం ప్రమాదానికి సంబంధించి రోడ్డు రవాణాధికారులతో వేరుగా సమావేశాన్ని నిర్వహించారు. ప్రమాదానికి బాధ్యులైన కాళేశ్వరీ ట్రావెల్స్ వారిపై తగు చర్యలు తీసుకోవడంతో పాటు నిబంధనలను అతిక్రమించి వాహనాలను నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ రోడ్డు రవాణాధికారులను ఆదేశించారు.  ఇలా ఎవరికి వారుగా సమీక్షలను నిర్వహించారే తప్ప ఇద్దరు ఒక దగ్గర కూర్చోని సమీక్షంచడం లేదు. దీని వల్ల సంబంధిత అధికార యంత్రాంగం కూడా ఇబ్బందులకు గురికావల్సి వస్తుందని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం, పీసీసీ ఒకే వేదికపై ఉన్నారు. ఇద్దరూ వైఎస్ఆర్ పార్టీని టార్గెట్గా ప్రచారం చేశారు. ఫలితాలు వచ్చాక మాత్రం ఎడ ముఖం, పెడ ముఖం అన్నట్లుగా వ్యవహారించడం మళ్లీ మొదలైంది. వీరిద్దరి మధ్యన చాలా కాలంగానే ఆధిపత్యపోరు సాగుతోంది.  ఉప ఎన్నికల వేళ తాత్కాలికంగా పక్కన బెట్టిన వీరు మళ్లీ పాత పంచాయితీకి తెరలేపినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలపై ఇప్పటి వరకు సమీక్షను నిర్వహించని సీఎం, పీసీసీ చీఫ్ లిద్దరూ ఫలితాలకు తనకంటే తనకు సంబంధం లేదనీ ఒకరిపై మరొకరు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతానికి కాంగ్రెస్ అధిష్టానం రాష్ర్టపతి ఎన్నిక విషయంలో బిజిబిజిగా వుంది.  ఈ ఎన్నిక ముగిసే వరకు అధిష్టానాని రాష్ర్ట రాజకీయాలపై అంతగా ఆసక్తిని చూపే టైం లేదు. రాష్ర్టపతి ఎన్నికయ్యాక ఉప ఎన్నికల ఫలితాలపై ఎవరిపై ఎవరు ఫిర్యాదు చేసుకున్నా, చేసుకోకపోయినా అధిష్టానం మాత్రం కొరఢాను ఝళిపించడం ఖాయమనీ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు. ఏది ఏమైనా పార్టీ-ప్రభుత్వం మధ్యన సయోధ్య లేదనీ మరోమారు రుజువైంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: