పది ఉరితాళ్ల తయారీకి ఆదేశం.. ఎవరికోసమో తెలుసా ?
దిశ నిందితుల మాదిరే.. నిర్భయ దోషుల కథ కూడా ముగియబోతోందా? త్వరలోనే వారికి ఉరిశిక్ష అమలు కాబోతోందా? అందుకోసం ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయా? ఇప్పుడీ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్లో దిశ నిందితుల ఎన్ కౌంటర్ దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఢిల్లీ నిర్భయ నిందితులకు సైతం తక్షణం శిక్ష వేయాలనే డిమాండ్ పెరిగింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే.. ఆ దిశగానే అడుగులు పడుతున్నట్టుగా కనిపిస్తోంది. వారికి ఉరి తప్పనిసరి అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. బీహార్లోని బక్సర్ జైలుకు వచ్చిన సూచనలు చూస్తుంటే.. అది నిజమేననిపిస్తోంది.
ఉరితాళ్లను తయారు చేయడంలో బక్సర్ జైలు చాలా ఫేమస్. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉరితాళ్లను తయారు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ జైలు అధికారులకు ఒక సందేశం వచ్చింది. వారాంతానికి మొత్తం పది ఉరితాళ్లు సిద్ధం చేయించాలన్నది దానిలోని సారాంశం. దీంతో అవి తయారు చేయిస్తున్నది నిర్భయ దోషులను ఉరితీయడానికేనన్న ప్రచారం మొదలైంది.
పది ఉరి తాళ్లను డిసెంబర్ 14లోపు తయారు చేసి ఉంచాలంటూ సందేశం వచ్చిన విషయాన్ని బక్సర్ జైలు అధికారులు కూడా దృవీకరిస్తున్నారు. అయితే వాటిని ఎందుకు తయారు చేయించమన్నారు? ఎక్కడికి పంపిస్తారు? అనే విషయం మాత్రం తమకు తెలియదంటున్నారు. ఒక్క ఉరితాడును తయారు చేసేందుకు మూడు రోజుల సమయం పడుతుంది. పార్లమెంటు దాడుల సూత్రధారి అఫ్జల్ గురును ఉరితీసేందుకు కూడా ఇక్కడి నుంచే ఉరితాళ్లను పంపించారు.
నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురిని త్వరలోనే ఉరితీస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే నిర్భయకేసు దోషులు, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇటీవల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రేపిస్టులకు క్షమాభిక్ష అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేయడంతో.. వారికి క్షమాభిక్ష లభించే అవకాశం లేనట్టు తెలుస్తోంది. అందుకే వారిని ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయనే ప్రచారం ఊపందుకుంది.