జగన్ డెసిషన్‌కు ఎందుకంత క్రేజ్ ... ఆ రాష్ట్రాల మంత్రుల రాక...!
ఆంధ్రప్రదేశ్ లో మహిళల భద్రత లక్ష్యంగా ఆమోదించిన దిశా చట్టం ఇప్పుడు సంచలనంగా మారింది. రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకు అన్యాయం జరగకూడదు అని భావించిన ముఖ్యమంత్రి జగన్... దిశా చట్టానికి రూపకల్పన చేసారు. ఏడు రోజుల్లో విచారణ, ఏడు రోజుల్లో తీర్పు, ఏడు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి మరణ శిక్ష విధించే చట్టాన్ని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టగా... అది ఆమోదం కూడా పొందింది. దీనిపై పలు రాష్ట్రాల్లో హర్షం వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో మహిళలు జగన్ కు పాలాభిషేకం కూడా చేశారు.
రాజకీయంగా కూడా ఇది జగన్ కి మైలేజ్ తీసుకొచ్చింది అనే వ్యాఖ్యలు ఇప్పుడు వినపడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటె... దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇప్పటికే జగన్ కి లేఖ కూడా రాసారు. ఈ చట్టం తీసుకొచ్చినందుకు గాను జగన్ ని ఆయన అభినందించారు. ఇకపోతే ఈ చట్టం ఆమోదం పొందడంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య కూడా హర్షం వ్యక్తం చేసారు. ఇక ఈ బిల్లుపై ఇతర రాష్ట్రాలు కూడా దృష్టి పెట్టాయి. మహిళల భద్రత కోసం వాళ్ళు కూడా దీనిని ప్రవేశ పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిని బట్టి ఈ చట్టానికి దేశ వ్యాప్తంగా ఏ రేంజులో క్రేజ్ ఉందో స్పష్టంగా తెలుస్తోంది.
ఢిల్లీ నుంచి మంత్రుల బృందం కూడా అమరావతి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తెలంగాణా మంత్రులు కూడా దీనిపై ఆరా తీసారు. అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి కూడా మంత్రులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అన్ని రాష్ట్రాలు కలిసి ఈ చట్టానికి ఆమోదం తెలిపితే కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావొచ్చని, కేంద్రం ఆమోదం పొందే విధంగా ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ చట్టం సంచలనంగా మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.