జగన్ పై జనసేన నాయకుడు పవన్ సంచలన వ్యాఖ్యలు
వైసీపీని నమ్మి ఓటు వేసినందుకు పింఛన్ కోసం ఎదురుచూసే వృద్ధులు భారీగా నష్టపోయారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తంచేశారు. వైసీపీ ఎన్నికల హామీలో వృద్ధాప్య పెన్షన్ 2 వేల నుంచి 3 వేలకు పెంచుతామని చెప్పిందని గుర్తుచేశారు. ‘పెన్షన్ అమలులో వైసీపీ ప్రభుత్వం అంచెంచెలుగా మాట తప్పుతోందనాలా.. లేక మోసం చేస్తోందనుకోవాలా..’ అని సోమవారం ట్విటర్లో అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పెన్షన్ను రూ.2,250 మాత్రమే చేసిందని.. దీనివల్ల ప్రతి లబ్ధిదారూ నెలకు రూ.750 నష్టపోతున్నారని తెలిపారు.
అలాగే వృద్ధాప్య పెన్షన్ పొందే అర్హతను 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామని ప్రభుత్వం మే 30న జీవో 103 జారీచేసిందని.. కానీ ఈరోజు వరకూ రాష్ట్రంలో ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయలేదని ఆక్షేపించారు. పెన్షన్ వయస్సు తగ్గిస్తే కొత్తగా 10 లక్షల మందికి పింఛను ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం నెలకు ఇస్తున్న రూ.2,250 లెక్కన చూసుకుంటే, ఒక్కో కొత్త పింఛన్ లబ్ధిదారు ఏడు నెలల వ్యవధిలో 15,750 వరకూ నష్టపోయినట్లు పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. జనసేన ఆత్మీయ యాత్ర పేరుతో రాయలసీమ జిల్లాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్బంలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ కొంతమందికే సీఎంలాగా వ్యవహరిస్తున్నారు కాబట్టే జగన్ రెడ్డి అని పిలుస్తున్నానంటూ ఎద్దేవా చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలిపిస్తే వారు ప్రజలకు ఉపయోగపడటం లేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో తప్పులు చేసిందని విమర్శించిన జగన్ ఆ తప్పులను ఇప్పుడెందుకు బయటపెట్టడంలేదని ప్రశ్నించారు.
చిన్న ఓరంపాడులో పచ్చదనాన్ని ఇచ్చే చెట్లును నరికారని, ఆ చెట్ల కన్నీటి శాపం.. నరికిన వారిని సమూలంగా నాశనం చేస్తుందంటూ శాపనార్దాలు పెట్టారు. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ గడ్డ కాదన్న పవన్ రాయలసీమను చదువుల తల్లిగా మారుస్తానని సీమ స్థితిగతులను మార్చేందుకే ఇక్కడికి వచ్చానని పవన్ కల్యాణ్ చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రైతుల సమస్యపై ప్రధాని మోదీకి లేఖ రాస్తానని అన్నారు. పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ తిరుపతిలో పర్యటించి తిరుపతి, చిత్తూరు పార్లమెంటరీ నాయకులతో సమీక్ష కూడా నిర్వహించారు. కడప, రాజంపేట పార్లమెంటరీ నేతలతో సమీక్ష నిర్వహించి పార్టీ ప్రణాళికలపై చర్చించారు.