ఏపీ ప్రభుత్వంతో కార్పొరేట్ సంస్థలు ఒప్పందం..!

NAGARJUNA NAKKA

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నాడు నేడు కార్యక్రమానికి సహకారం అందించడానికి కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. మొత్తం 2,566 ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగు పరచడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. 

 

కనెక్ట్‌ టు ఆంధ్రా కింద నాడు నేడు కార్యక్రమానికి 5 కార్పొరేట్‌ సంస్థలు తోడ్పాటు అందించేందుకు  ముందుకొచ్చాయి. హెటిరో, వసుధ ఫార్మా, ఆదిలీల ఫౌండేషన్, రెయిన్‌ కార్బన్‌ సంస్థలు ఏపీ సర్కారుతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. పాఠశాల విద్యాశాఖ ద్వారా గుర్తించిన 2,566 ప్రభుత్వ స్కూళ్లలో నాడు నేడు కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు.  ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ సమక్షంలో..  ఈ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదిరింది. 

 

కడప జిల్లాలో 402 పాఠశాలల్లో అభివృద్ధికి 20 కోట్లకు పైగా ఖర్చుపెట్టాలని హెటిరో సంస్థ నిర్ణయం తీసుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలో 428 స్కూళ్లను అభివృద్ధికి 21 కోట్లు ఖర్చు చేస్తామని వసుధ ఫార్మా తెలిపింది. కర్నూలు జిల్లాలో 66 స్కూళ్లను 1.65 కోట్లు తో అభివృద్ధి చేస్తామని రెయిన్‌ కార్బన్‌ ముందుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో 281 స్కూళ్ల అభివృద్ధికి 25 కోట్లు ఖర్చుచేయాలని ఆదిలీల ఫౌండేషన్‌ నిర్ణయించుకుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 359 స్కూళ్లను 18 కోట్లతో అభివృద్ధి చేస్తామని లారస్ ల్యాబ్స్ అగ్రిమెంట్ చేసుకుంది. 

 

ప్రభుత్వ స్కూళ్లు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. నాడు  నేడు ద్వారా వాటిని అభివృద్ది చేస్తామన్నారు. 45 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లను 12 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి. ప్రతి స్కూల్లో ఇంగ్లిషు ల్యాబ్, 9 రకాల సదుపాయలను కల్పిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను 1 నుంచి 6 వ తరగతి వరకూ వచ్చే ఏడాది నుంచి ప్రవేశపెడతామన్నారు. ఆ తర్వాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ పోతామని చెప్పారు. 

 

పాఠశాలల అభివృద్ధికి సహాయం కోసం ప్రభుత్వం చేపట్టిన కనెక్ట్ టూ ఆంధ్రకు భారీ స్పందన వచ్చింది.. రాష్ట్రంలో మొదటి విడతగా ఐదు సంస్థలు రూ.88 కోట్లు విరాళంతో నాలుగు జిల్లాల్లో 2500 స్కూల్స్ ను అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చారు. క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ దాతలతో సమీక్షించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని సంస్థలు ముందుకు రావడాన్ని అభినందించారు. అభివృద్ధి చేసిన పాఠశాలలో దాతల పేర్లు పెడతామని అన్నారు. అక్షరాస్యతతో పాటు పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నది ముఖ్యమంత్రి మాట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: