ఆర్టీసీ కార్మికులకు జగన్ మరో శుభవార్త... సంక్రాంతి బొనాంజా... ?

Reddy P Rajasekhar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ ఆర్టీసీ కార్మికులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్మికులకు సంక్రాంతి పండుగ అడ్వాన్స్ చెల్లించడం కొరకు ఆమోదం తెలిపింది. 

సీఎం ఆదేశాల మేరకు ఆర్టీసీ యాజమాన్యం అడ్వాన్స్ కొరకు 19 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటన చేసింది. ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు జనవరి నెల 1వ తేదీన డిసెంబర్ నెల వేతనంతో అడ్వాన్స్ కలిపి కార్మికులకు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. క్లాస్ 3 ఉద్యోగులకు 4500 రూపాయలు క్లాస్ 4 కేటగిరీ ఉద్యోగులకు 4వేల రూపాయలు అడ్వాన్స్ గా ఇవ్వనున్నారు. 
 
సీఎం జగన్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తరువాత ఆర్టీసీ కార్మికులపై వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం దిశగా చర్యలు చేపట్టారు. ఏపీ రాష్ట్ర కేబినేట్ గతంలోనే ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో 2020 జనవరి నెల నుండి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టగా బిల్లు సభ ఆమోదం పొందింది. 
 
జనవరి నెల 1వ తేదీ నుండి ఆర్టీసీలో పని చేస్తున్న 52,000 మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన అడ్వాన్స్ ను వారి వేతనాల నుండి పది నెలల్లో రికవరీ  చేసుకుంటుందని సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బందికి దసరా అడ్వాన్సులు ఇచ్చేది. నాలుగేళ్లుగా ఆర్టీసీ యాజమాన్యం సంక్రాంతి అడ్వాన్సులను చెల్లిస్తోంది. ప్రభుత్వం సూచనల మేరకు అడ్వాన్స్ చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం పట్ల ఆర్టీసీ కార్మికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: