జేసి మరీ ఇంత పిరికివాడా ?

Vijaya
మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి మరీ ఇంత పిరికివాడని అనుకోలేదు.  నోటికొచ్చినట్లు మాట్లాడేయటం ఎదుటివారు ఎదురుతిరిగితే వెంటనే మాట మార్చేయటం జేసికి బాగా అలవాటైపోయింది. అనంతపురం జిల్లాలో చంద్రబాబునాయుడు పర్యటనలో జేసి మాట్లాడుతూ  ’అధికారంలోకి రాగానే తమ బూట్లు నాకే పోలీసు అధికారులను జిల్లాకు తెచ్చుకుంటామ’ని చేసిన ప్రకటన సంచలనంగా మారింది. జేసి అలా ప్రకటన చేశారో లేదో వెంటనే అనంతపురం జిల్లాతో పాటు వివిధ జిల్లాల పోలీసు అధికారుల సంఘాల నుండి గట్టిగా కౌంటర్లు మొదలయ్యాయి.

పోలీసుల్లో మొదలైన వ్యతిరేకతను వెంటనే గ్రహించిన జేసి వెంటనే మాట మార్చారు. తన మాటల్లోని ఆవేధన చూడాలే కాని మాటలఅర్ధాన్ని కాదంటూ బుకాయించటం మొదలుపెట్టారు. తమను ఇబ్బందులు పెడుతున్న పోలీసు అధికారుల విషయంలోనే తాను మాట్లాడాను గాని పోలీసులంటే తమకు చాలా గౌరవం ఉందంటూ కతలు చెబుతున్నారు. నిజానికి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పినట్లే పోలీసులు నడుచుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే.  

జేసి బ్రదర్స్ కున్న నోటి దురద టిడిపి నేతల్లో ఇంకెవరికీ లేదన్న విషయం అందరికీ తెలుసు. మనసులోని మాటను ఉన్నదున్నట్లు చెప్పేస్తారన్న ముసుగులో మాజీ ఎంపి  నోటికొచ్చినట్లు మాట్లాడేస్తుంటారు. ఆమధ్య తాడిపత్రిలోనే ఉన్న ప్రభోదానంద స్వామి ఆశ్రమ నిర్వాహకులతో కూడా జేసి బ్రదర్స్ కు గొడవైన విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు కూడా పోలీసులను నోటికొచ్చినట్లు తిట్టారు. అప్పుడు తిట్టిన తిట్లకే పోలీసు ఇన్ స్పెక్టర్ గోరంట్ల మాధవ్ తీవ్రంగా రియాక్ట్ అవటం తర్వాత జరిగిన పరిణామాల్లో ఏకంగా హిందుపురం ఎంపినే అయిపోయారు.

మళ్ళీ ఇపుడు జేసి అదే పద్దతిలో పోలీసులపై  తిట్ల దండకం అందుకున్నారు.  నిజానికి టిడిపి అధికారంలో ఉన్నపుడు పోలీసులను అడ్డం పెట్టుకుని వైసిపి నేతల్లో చాలామందిని జేసి సోదరులు కానీ అప్పటి ప్రజాప్రతినిధులు కానీ బాగానే ఇబ్బందులు పెట్టారు. ఆ విషయాలన్నీ మరచిపోయినట్లు నటిస్తు ఇపుడు బుద్ధులు చెప్పటమే విచిత్రంగా ఉంది.  అందుకే అన్నారు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: