నిరసనలు ఆపేందుకు జాతీయగీతం పాడిన డిసిపి

Suma Kallamadi

కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (క్యాబ్)ను సవాలు చేస్తూ శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహూవా మొయిత్రా, కాంగ్రెస్ నేత జైరాం రమేష్‌లు వేర్వేరుగా ఈ చట్టాన్ని సవాలు చేశారు. కేంద్రం తీసుకువచ్చిన క్యాబ్‌తో ఈశాన్య భారతంలో నిరసన జ్వాలలు చెలరేగిన దశలోనే ఈ వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్‌లకు చెందిన ముస్లిమేతర వర్గాలకు భారత పౌరసత్వాన్ని కల్పించే ఉద్ధేశంతో తీసుకువచ్చిన బిల్లుకు తీవ్రవాదోపవాదాల తరువాత పార్లమెంట్ ఆమోదం లభించింది. చాలా చోట్ల దీనిపై నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయి. పౌరసత్వాన్ని చట్టం మున్ముందు చాలా ప్రమాదాలను తెచ్చిపెడుతుందని భారత్ లోని చాలా మంది ప్రజలు భావిస్తున్నారు. 


 పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శనకు దిగిన నిరసనకారులను శాంతింపజేసేందుకు బెంగళూరు (సెంట్రల్) డీసీపీ చేతన్ సింగ్ రాథోర్ వినూత్న శైలిలో వ్యవహరించారు. బెంగళూరు టౌన్ హాల్‌ వద్ద నిరసనకారులు ఆందోళనకు దిగడంతో డీసీపీ వారిని శాంతిపజేసి వెనక్కి పంపే ప్రయత్నం చేశారు. అయితే తాము వెనక్కి వెళ్లేది లేదని నిరసనకారులు భీష్మించుకు కూర్చున్నారు. తనను నమ్మండని, ఆందోళన వద్దని, తనను విశ్వసించినట్లయితే తనతో కలిసి జాతీయ గీతం పాడమని వారిని డీసీపీ చేతన్ కోరారు. అనంతరం, ఆయన జాతీయ గీతాలాపన చేశారు. నిరసనకారులు కూడా ఆయనతో గొంతు కలిపారు. జాతీయగీతం పాడటం పూర్తికాగానే నిరసనకారులు శాంతించి అక్కడి నుంచి తమంత తాముగా వెనుదిరిగారు. నిరసన కారులు శాంతించడంతో డీసిపి కూడా వారికి ధన్యవాదాలు తెలిపారు. 


బెంగుళూరులో గురువారం జరిగిన ప్రదర్శన హింసకు దారితీయడంతో పోలీసు కాల్పుల్లో ఇద్దరు మృతిచెందారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ సహా పలువురిని బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా నిర్బంధంలోకి తీసుకున్నారు. మంగళూరు సిటీ, దక్షిణ కన్నడ జిల్లాలో 48 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: