ఈసారైనా పూర్తి అవుతుందా...? నేడే ముచ్చటగా మూడోసారి జగన్ చేతుల మీదుగా కడప ఉక్కు కర్మాగారం శంకుస్థాపన

Suma Kallamadi

కడప ఉక్కు కర్మాగారం... కడప వాసుల దశాబ్దాల కల కడప ఉక్కు కర్మాగార ఏర్పాటుకు ఏపీ సర్కార్ రంగం పూర్తిగా సిద్ధం చేసుకుంది. నాటి సీఎం వైఎస్సార్, చంద్రబాబు శంకుస్థాపనలకే పరిమితం కాగా నేడు ముచ్చటగా మూడోసారి కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి శంకుస్థాపన చేయనున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లె వద్ద ముఖ్యమంత్రి ఉక్కు కర్మాగారానికి భూమిపూజ చేస్తారు. అనంతరం జమ్మలమడుగులో ఏర్పాటు చేసే బహిరంగ సభలో జగన్ మాట్లాడనున్నారు. కడప ఉక్కు కర్మాగార ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ఏపీ సర్కార్ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు చొరవ చూపారు. 

ఈ కర్మాగారంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి కల్పించాలన్న నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు అయిన కడప ఉక్కు కర్మాగార ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు నేటి సీఎం జగన్. రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మాణం చేయనున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లె వద్ద ఏర్పాటు ఈ కర్మాగారానికి కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,275.66 ఎకరాలను దీనికి కేటాయించారు. 

అయితే దీని ద్వారా స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. సుమారు 20వేల మందికి ఉపాధి కల్పించే కడప స్టీల్ ప్లాంట్‌ను మూడేళ్లలోనే పూర్తి చేస్తామని ఇదివరకే సీఎం జగన్ చెప్పిన నేపధ్యంలో కడప వాసుల్లో సంతోషం వ్యక్తం అవుతుంది. దీనికి కారణం పరిశ్రమలలో 75 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి మరీ నిర్దేశించడంతో కడప, పొరుగు జిల్లాల్లోని అనేక మంది నిరుద్యోగులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. 

ఇవి ఇలా ఉండగా కడపలో ఉక్కు కర్మాగారానికి పునాది రాయి వేయడం ఇది మూడోసారి. మాజీ ముఖ్యమంత్రులు వైయస్ రాజశేఖరరెడ్డి, ఎన్ చంద్రబాబు నాయుడు జిల్లాలోని రెండు వేర్వేరు ప్రదేశాలలో ఉక్కు కర్మాగారానికి పునాది రాయి వేసినప్పటికీ, దురదృష్టవశాత్తు అవి అసలు కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడవ సారి జగన్ శంకుస్థాపన చేస్తున్న నేపధ్యంలో తమకు అదృష్టం కలిసివస్తుందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: