అయ్యో.. ఆ వైసీపీ ఎమ్మెల్యే క‌నిపించ‌డం లేద‌ట‌.. ఆందోళ‌న‌లో రైతులు..

Kavya Nekkanti

ఓవైపు వైసీపీ ప్రభుత్వం విశాఖ శివార్లలోని భీమిలీ చుట్టుపక్కల పరిపాలక రాజధాని కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తుంటే... ఇటువైపు అమరావతిలో భూములు ఇచ్చిన 29 గ్రామాల రైతులు ఆరో రోజు మహా ధర్నాతో ఆందోళనలను తీవ్రతరం చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి, అమరావతి నుంచీ రాజధానిని విశాఖకు తరలిస్తోందంటూ రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోడ్లను దిగ్బంధిస్తూ, బైటాయిస్తూ, టైర్లను తగలబెడుతూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ఇలా ఎలా వీలైతే అలా తమ ఆందోళనలను ఉద్ధృతం చేస్తున్నారు. 

 

అలాగే మ‌రోవైపు.. రాష్ట్రంలో రాజధానుల విషయమై తీవ్ర ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల స్థానిక ఎమ్మెల్యేలు కనిపించకపోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి కనిపించడం లేదని మంగళగిరి పోలీసు స్టేషన్‌లో నిడమర్రు రైతులు ఫిర్యాదు చేశారు. ఓవైపు అమరావతి రాజధాని తరలిపోతుందని రైతులు ఆందోళనలు చేస్తుంటే.. మరోవైపు ఎమ్మెల్యే ఆళ్ల అడ్రస్ లేకుండా పోయారంటున్నారు రైతులు. దీంతో ఆయన కనిపిస్తే వెతికి పెట్టడంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. అలాగే ఫిర్యాదులో.. ``రాజధానిపై నెలకొన్న సందిగ్దతపై మా గోడు వెళ్లబుచ్చుకుందామంటే మా ఎమ్మెల్యే ఎక్కుడున్నారో తెలియట్లేదు. 

 

మా ఎమ్మెల్యే కోసం తీవ్ర ఆందోళన చెందుతున్నాం. మీరు వెంటనే తగు చర్యలు తీసుకుని మా శాసన సభ్యులను మాకు అప్పగిస్తారని భావిస్తున్నాం. గత వారం రోజుల నుంచి మంగళగిరి నియోజకవర్గంలో గానీ.. ఆయన కార్యాలయంలోగానీ.. నివాసంలో గానీ ఎక్కడా ఆయన కనిపించట్లేదు. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. కావున వెంటనే ఆయన్ను వెతికి మాకు అప్పగించాల్సిందిగా కోరుతున్నాము’ అని ఫిర్యాదులో రాజధాని రైతులు, రైతు కూలీలు పేర్కొన్నారు. ఈ మేరకు ఫిర్యాదు పత్రంలో రాజధాని రైతులు, కూలీలు సంతకాలు కూడా చేశారు. అనంతరం మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు అందించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: