క్యాబినెట్ సమావేశానికి ముందే రాజధాని మార్పుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేయబోతున్నారా ? అమరావతి వర్గాల్లో ఇపుడిదే విషయం ప్రచారం జోరుగా సాగుతోంది. జిఎన్ రావు కమిటి నివేదికను ఈనెల 27వ తేదీన జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. దాంతో రాజధాని, అసెంబ్లీ, రాజ్ భవన్, హై కోర్టు తదితరాలపై స్పష్టత వస్తుందని అందరూ అనుకుంటున్నారు.
అయితే ఇపుడు హఠాత్తుగా రెండు రోజుల్లోనే జగన్ కీలక ప్రకటన అంటూ ఎందుకు ప్రచారం మొదలైంది ? ఈ విషయమే ఎవరికీ అర్ధం కావటం లేదు. పైగా ప్రకటన చేసిన తర్వాత రాజధాని ప్రాంతంలో అల్లర్లు జరుగుతాయని ప్రభుత్వం అనుమానిస్తోందట. అందుకనే యర్రుబాలెంలోని అంబటినగర్ లో ఉన్న ఓ కల్యాణమండపంలో 300 మందికిపైగా పోలీసు బలగాలను దింపిందట.
రాజధాని మార్పు ప్రకటనకు, పోలసు బలగాలను దింపటానికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా ? అన్న విషయంలో ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో మందటం, ఉద్ధండరాయునిపాలెం గ్రామాల్లో ఆందోళన చేస్తున్న వాళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పనిలో పనిగా రోడ్లపై వేసిన టెంట్లను ఎత్తేయించేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే స్ధానికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటోంది.
విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఉంటుందని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. వెలగపూడిలోనే అసెంబ్లీ, రాజ్ భవన్ కంటిన్యు అవుతుందని ప్రకటించారు. జగన్ ప్రకటన చేయగానే చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు నోటికొచ్చినట్లు మాట్లాడేశారు.
అయితే మెజారిటి జనాల్లో జగన్ ప్రతిపాదన విషయంలో సానుకూలతను చూసిన తర్వాత దిక్కుతోచక అప్పటి నుండి నోరెత్తటం లేదు. జిఎన్ రావు కమిటి నివేదిక వచ్చేసిన నేపధ్యంలో క్యాబినెట్ లో పెట్టి ఓకే చేయించుకుని అధికారికంగా ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో.
మరింత సమాచారం తెలుసుకోండి: