దశాబ్ధ కాల తెలంగాణ రాజకీయమిదే : 2014లోనే కాదు, 2018లోనూ కేసీఆర్ రాజకీయ చతురత.. రెండు సార్లు ఘనవిజయం

NAGARJUNA NAKKA

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాల్లో ఆరితేరిపోయారు. అందుకే 2014, 2018లో ఎన్నికల బరిలోకి దిగి విజయ దుందుభి మోగించారు. 2014 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు బాగానే నమ్మారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు తెలంగాణను చేస్తానని ఆయన ఇచ్చిన మాటను విశ్వసించారు. అందుకే ఉద్యమ నాయకుడిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం సీటులో కూర్చోబెట్టారు. 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికల నిర్ణయం ఫలించింది. టీఆర్ఎస్ గెలుపులో గ్రామీణ ఓటర్లు, రైతులు కీలకపాత్ర వహించారు. రైతుల కోసం కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రజల్లోకి విసృతంగా వెళ్లాయని చెబుతున్నారు. అలాగే 24 గంటల కరెంట్, మిషన్ కాకతీయ, కాళేశ్వరం తదితర భారీ ప్రాజెక్టులు వ్యవసాయదారులకు ఉపయోగపడేలా చేపట్టడం టీఆర్ఎస్‌ గెలుపునకు సహకరించాయి. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్‌ల పెంపు, గొర్రెలు, బర్రెల పంపిణీ తదితర పథకాలు టీఆర్ఎస్‌కు గ్రామాల్లో ఆధిక్యం తీసుకొచ్చేలా చేశాయి. ఎన్నికల్లో అర్భన్ నియోజకవర్గాల్లో కంటే గ్రామీణ నియోజకవర్గాల్లో పోలింగ్ టీఆర్ఎస్‌కు అనుకూలించింది.


ఉద్యమ నేతగా ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించిన నేతగా గుర్తింపు పొందిన కేసీఆర్‌ చరిష్మా ఈ ఎన్నికల్లో కూడా పనిచేసింది. దాదాపు 100 నియోజకవర్గాల్లో అన్నీ తానై ప్రచార బాధ్యతలు మోశారు. తెలంగాణ రాష్ట్ర సమితి 2014 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం, లక్ష ఉద్యోగాలు, కేజీ టూ పీజీ విద్య, దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ తదితర పథకాలు సరిగా అమలుకాకపోయినప్పటికీ ఓటర్లు వాటిని పెద్దగా పట్టించుకోకుండా టీఆర్ఎస్‌ను ఆదరించారని ఈ విజయం నిరూపిస్తోంది. 

 

ఇక గజ్వేల్ నుంచి బరిలోకి దిగిన కేసీఆర్‌ విజయదుందుభి మోగించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగిన వంటేరు ప్రతాప రెడ్డిపై 50 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో 19,366 ఓట్లతో వంటేరుపై గెలిచిన కేసీఆర్‌.. ఈ సారి భారీ మెజార్టీ దక్కించుకున్నారు. 1983, 1985, 1989, 1994, 1999, 2001, 2004లో సిద్దిపేట నుంచి కేసీఆర్ ఎమ్మల్యేగా గెలుపొందారు. తర్వాత కరీంనగర్‌ ఎంపీగా పోటీచేశారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ నుంచి కూడా ఎంపీగా పోటీ చేశారు. 2014లో గజ్వేల్‌ నుంచి ఎమ్మెల్యేగా, మెదక్‌ నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. మొత్తానికి కేసీఆర్ 2014, 2018లోనూ తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ప్రత్యర్థులు పేల్చే మాటల తూటాలకు సరైన సమాధానమిచ్చి.. ప్రజల ఆదరణ చూరగొన్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: