అమరావతి రైతులకు న్యాయం చేయాలి : వైసీపీ ఎంపీ
జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని రగడ రగులుతూనే ఉన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాజధాని విషయంలో చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా అమరావతి మొత్తం అట్టుడుకుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని అభివృద్ధి ఒకేచోట ఆగిపోకుండా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో మూడు రాజధానిలు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇక రాజధాని అధ్యయనం కోసం నియమించిన కమిటీ కూడా జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీంతో అటు విపక్ష పార్టీలకు జగన్ నిర్ణయం పై దుమ్మెత్తి పోస్తున్నాయి.
అమరావతిలో రైతులందరూ నిరసన బాట పట్టిన విషయం తెలిసిందే. తాము పంట పండించుకునే భూమిని అమరావతి నిర్మాణం కోసం భవిష్యత్తు తరాలు బాగుండాలని ఉద్దేశంతోనే త్యాగం చేశామని కానీ ఇప్పుడు జగన్ సర్కార్ అమరావతి నుండి రాజధానిని తరలిస్తామంటే తమకు అన్యాయం జరుగుతుంది అంటూ అమరావతి రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు ఆందోళనలు రిలే నిరాహార దీక్షలతో అమరావతి మొత్తం హాట్ హాట్ గా మారింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధానిల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ అమరావతి రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనికోసమై ప్రధానికి లేఖ కూడా రాశారు. జగన్ తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయంపై కలుగా చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు అమరావతి రైతులు.
ఇకపోతే తాజాగా అమరావతి రైతులను ఉద్దేశించి వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ న్యాయం చేయాలంటూ నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వ్యాఖ్యానించారు. రాజధాని ఎక్కడ నిర్మిస్తారనే దానికంటే గతంలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ న్యాయం జరగడం ముఖ్యమంటూ... ఆయన తెలిపారు. తాజాగా నరసరావుపేట లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతి నుంచి రాజధాని తరలించిన అప్పటికీ అమరావతి రైతులందరికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తారు అన్న నమ్మకం తనకు ఉందన్నారు ఆయన. రాజధాని నిర్మిస్తామని గత ప్రభుత్వం చెబితేనే అమరావతి రైతుల భూములు ఇచ్చారని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.