జగన్ నిర్ణయంతో..ఏపీలో లాయర్లు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలట..?
ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై విపరీతమైన చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై చాలా సెటైర్లు పేలాయి. కొన్ని తమాషా వీడియోలు కూడా రూపుదిద్దుకున్నాయి. అందులో ఒక దాంట్లో.. ఓ ప్రభుత్వ ఉద్యోగి.. జగన్ నిర్ణయం కారణంగా రాజధానికో పెళ్లాన్ని మెయింటైన్ చేసినట్టు చూపించారు. అయితే ఇది కామెడీ కాబట్టి పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు.
కానీ ఓ టీడీపీ నేత కూడా ఇప్పుడు ఈ వీడియో నుంచి స్ఫూర్తి పొందినట్టున్నాడు.. వివాదాస్పద కామెంట్లు చేశారు. అనంతపురం జిల్లా టిడిపి అద్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్.పి కూడా అయిన బికె.పార్దసారది ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి, విజయవాడ ,విశాఖపట్నం లలో బెంచ్ లు ఏర్పాటు చేయడం అంటే న్యాయవాదులు మూడు చోట్ల ఇళ్లు కట్టుకోవాలని, అలాగే మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
లాయర్లు మూడు పెళ్లిళ్లు చేసుకుని.. మూడు చోట్ల కుటుంబాలను పోషించాలని పార్థసారథి అంటున్నారు. విచిత్రం ఏంటంటే.. కర్నూలులో హైకోర్టు పెట్టాలని ఈ టిడిపి నేతలు గతంలో డిమాండ్ చేశారు కూడా. నిన్న చంద్రబాబు కూడా కర్నూల్లో హైకోర్టు బెంచ్ పెట్టాలని టీడీపీ ప్రభుత్వంలోనే చెప్పామంటూ కవర్ చేసుకున్నారు. ఇప్పుడేమో ఇలా సెటైర్లు పేలుస్తున్నారు.
ఇక వీరి సంగతి ఎలా ఉన్నా.. సీఎం జగన్ ఇప్పటికే మూడు రాజధానుల ప్రకటన చేశారు. ఇక దాన్ని అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. ఈ విషయంలో ఏమైనా అద్భుతం జరిగితే తప్ప మార్పు ఉండకపోవచ్చు. ఈ విషయంపై ఈనెల 27 కేబినెట్ మీటింగ్ జరగబోతోంది. ఇందులో కూలంకషంగా రాజధానుల విషయంపై చర్చిస్తారు. ఓ పైనల్ డెసిషన్ తీసుకుంటారు. అయితే.. ఆ కేబినెట్ మీటింగ్ తర్వాత.. 28 న జగన్ విశాఖలో కీలకమైన ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 27 న కేబినెట్ లో విశాఖ రాజధానిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే విశాఖ అభివృద్ధికి చెందిన కీలక ప్రకటనలు ఈనెల 28న విశాఖలో జగన్ ప్రకటించే అవకాశం ఉంది.