హోంమంత్రికే షాక్ : నా మొగుడిని నేనే చంపేశా.. నన్ను శిక్షించండి..

Chakravarthi Kalyan

భారతీయ స్త్రీ సహనానికి ప్రతీక అంటారు. భర్త ఎంత హింసించినా గుట్టుగా కాపురం నడుపుకొస్తుంది. భర్త, పిల్లలే ప్రపంచంగా బతుకుతుంది. మరి అలాంటి భార్య కోపం కట్టలు తెంచుకుంటే.. ఆ మహిళ ఆగ్రహం ఉగ్రరూపం దాలిస్తే.. అప్పుడు అడ్డుకునేదెవరు.. బహుశా ఎవరూ ఉండరేమో.

 

ఇందుకు ఉదాహరణ హర్యానాలో జరిగిన ఓ ఘటన.. రెండేళ్ల క్రితం.. ఆ రాష్ట్రంలో ఓ మహిళ భర్తను చంపేసింది. కానీ ఆ నేరాన్ని ఎలా కప్పిపుచ్చిందో ఏమో కానీ.. రెండేళ్ల వరకూ ఆ విషయం ఎవరికీ తెలియలేదు. కానీ.. ఆ మహిళను పాపబీతి భయపెట్టిందో.. అంతరాత్మ వేధించిందో తెలియదు కానీ.. ఆమే స్వయంగా తన నేరాన్ని బయటపెట్టింది. తనను శిక్షించమని కోరంది.

 

ఐతే.. ఆమె పోలీసులను ఆశ్రయించకుండా ఏకంగా మంత్రిగారికి తన విషయం వివరించింది. ఆ రాష్ట్ర హోంమంత్రి నిర్వహించిన జనతా దర్బార్‌ కార్యక్రమంలో ఆమె ఈ విషయం బయటపెట్టింది. ఈ కార్యక్రమానికి ఒక మహిళ ఏడుస్తూ వచ్చింది. రెండేళ్ల క్రితం తన భర్తను తానే హత్యచేశానని, అందుకు తనకు శిక్ష విధించమని కోరింది.

 

దీంతో.. మొదట ఆశ్చర్యపోయిన మంత్రి, ఆ తర్వాత ఆమెను పోలీసులకు అప్పగించారు. పోలీసులు దీనిపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించారు. మాకు ఫిర్యాదు అందింది. భర్త మరణానికి తానే కారణమని ఆ మహిళ చెప్పారు. తాను తప్పు చేశానంటూ మంత్రి వద్ద ఆమె లిఖితపూర్వకంగా అంగీకరించారు. ఆ మేరకు మేము ఎఫ్‌ఐఆర్‌  నమోదు చేస్తాం. కేసు దర్యాప్తు చేపడతాం అంటున్నారు మహేష్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారులు.

 

అయితే ఆమె ఎలా భర్తను హత్య చేసింది.. ఎందుకు హత్య చేసింది.. ఈ హత్య ఇన్నాళ్లూ బయటకు రాకుండా ఎలా ఉంది.. ఇలాంటి విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తులో ఈ వాస్తవాలు వెలుగు చూస్తాయేమో కానీ.. ఓ మహిళ తన నేరం హోంమంత్రి ముందు ఒప్పుకోవడమే షాకింగ్ వార్త.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: