రాజధాని మార్పుపై ప్రశ్నిస్తున్న నాయకులు..
నవ్యాంధ్రలో రాజధానుల మార్పు అంశం రాజకీయంగా పీక్‌కి చేరింది. అమరావతిని మార్చొద్దని కొందరు, విశాఖలో హైకోర్టు ఏర్పాటు చేయాలని మరికొందరు.. డిమాండ్లు తెరపైకి తీసుకొస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే.. అమరావతి, విశాఖపట్టణంలో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ ఏపీ ప్రభుత్వానికి నివేదించింది. దీంతో అమరావతి, కర్నూలులో కూడా మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలనే కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది.
రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీలో ఉంటే బొల్లారంలో కూడా శీతకాల విడిది ఉందని టీజీ వెంకటేశ్ గుర్తుచేశారు. అలాగే ఏపీలో మూడు రాజధానుల ప్రకటన బాగుందని, దానిని మరింత పరిపూర్ణం చేయాలని టీజీ వెంకటేశ్ కోరారు. అమరావతి రాజధాని ఉండాలని కోరితే ఇక్కడి వారికే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అలా కాకుండా అమరావతిని ఫ్రీ జోన్ చేస్తే రాష్ట్రంలోని అందరికీ ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ఇప్పుడే కాదు టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఇదే విషయం చెప్పానని తెలిపారు.
కర్నూలులో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాల్సిందేనని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాయలసీమ ఐక్యవేదిక తరఫున హెచ్చరించారు. ఇప్పుడే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అధికార వికేంద్రీకరణ కోసం ఉద్యమించామని టీజీ గుర్తుచేశారు. సమ్మర్, వింటర్ క్యాపిటల్ పేరుతో మూడు విభాగాలు ఉండాలని అభిప్రాయపడ్డారు.
కర్నూలులో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయకుంటే ఉద్యమం తప్పదని టీజీ వెంకటేశ్ హెచ్చరించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించి.. విశాఖపట్టణం, అమరావతిలో కూడా బెంచ్ ఏర్పాటు చేస్తామని జీఎన్ రావు కమిటీ పేర్కొన్నది. అలాగే విశాఖపట్టణంలో సెక్రటేరియట్ ఉంటే అమరావతి, కర్నూలులో మినీ సెక్రటేరియట్ ఉండాలని కోరారు. తమ ప్రతిపాదనతో మిగతా ప్రాంతాల వారు ఆందోళన తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. తమ వినతిని సీఎం జగన్ అధికారులతో చర్చించి నిర్ణయం వెలువరించాలని కోరారు. తమ సూచనలను అధికారులతో చర్చించి, నిర్ణయం ప్రకటించాలని టీజీ సూచించారు. లేదంటే రాయలసీమ హక్కుల వేదిక తరఫున పోరాడుతామని ప్రకటించారు.