జగన్ పై మంత్రులు, ఎంఎల్ఏలు అంత ఒత్తిడి పెట్టారా ?
జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడురాజధానుల నిర్ణయంపై ఈరోజు క్యాబినెట్ సమావేశం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది. రాజధానుల తరలింపుపై జీఎన్ రావు కమిటి ఇచ్చిన నివేదికపై క్యాబినెట్ సమావేశం సుదీర్ఘంగానే చర్చించింది. అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడటమే విచిత్రంగా ఉంది. నిర్ణయం తీసుకోకపోవటానికి బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బిసిజి) నివేదిక ఇంకా ఇవ్వకపోవటమే అని చెబుతున్నారు.
ఒకవేళ అదే నిజమైతే కన్సల్టెన్సీ నివేదిక ఇవ్వకుండానే ఈరోజు క్యాబినెట్ సమావేశంలో జిన్ రావు నివేదికపై చర్చించాల్సిన అవసరం ఏమిటి ? మూడు రాజధానుల ప్రతిపాదనపై ఈరోజు క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్సా సత్యనారాయణ ఎలా చెప్పారు ? రాజధానుల తరలింపు అంశాన్ని బిసిజి రిపోర్టు ఇచ్చిన తర్వాతే తీసుకుంటామని చెప్పుంటే ఇంత గొడవ ఉండేది కాదు కదా ?
కాబట్టి రాజధానుల ఏర్పాటుపై నిర్ణయం వాయిదా పడటానికి బిసిజి నివేదిక ఇవ్వకపోవటం కారణం కాదని తెలిసిపోతోంది. కారణం ఏమిటి ? ఏమిటంటే ఎంఎల్ఏలు, మంత్రుల నుండి జగన్ పై తీవ్రమైన ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. రాజధానుల తరలింపు అంశంపై క్షేత్రస్ధాయిలో జరుగుతున్న గొడవలు, ఆందోళనలను చర్చించేందుకు గురువారం సాయంత్రం ఎంఎల్ఏలు, మంత్రులు సమావేశం అయిన విషయం తెలిసిందే.
ఈ సమావేశంలో ఎంఎల్ఏలు మాట్లాడుతూ రాజధానుల ఏర్పాటు, విశాఖపట్నంను రాజధానిగా ఏర్పాటు చేసే ప్రతిపాదనపై అమరావతి ప్రాంతంలోని జనాల్లో కనిపిస్తున్న వ్యతిరేకతను మంత్రులతో చెప్పుకున్నారట. జగన్ ప్రకటన తర్వాత తాము గ్రామాల్లో కూడా తిరగలేకపోతున్నట్లు గుంటూరు జిల్లాలోని ఎంఎల్ఏలు మంత్రులతో చెప్పినట్లు సమాచారం. దాంతో క్షేత్రస్ధాయిలోని ఇబ్బందికర పరిస్ధితులున్నట్లు మంత్రులు కూడా ఏకీభవించారు.
అదే విషయాన్ని క్యాబినెట్ సమావేశంలో జగన్ దృష్టికి మంత్రులు తీసుకెళ్ళినట్లు తెలిసింది. తన క్యాబినెట్ లోని మంత్రులు, సొంత ఎంఎల్ఏలే తన ప్రతిపాదన విషయంలో ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించటంతో జగన్ కు కూడా షాక్ కొట్టినట్లైందట. దాంతో బిసిజి నివేదిక వచ్చిన తర్వాత చూద్దామన్న ధోరణిలో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం.