తెలంగాణాలో 'చేతులు' ఎత్తేస్తున్న కాంగ్రెస్ ? ఈ చేతలే నిదర్శనం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి మరింత దిగజారుతూ వస్తున్నట్టుగా అక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ పార్టీలో నాయకులకు ఇవి కొత్తేమి కాకపోయినా తరచుగా గ్రూప్ రాజకీయాలతో ఏదో ఒక గలాటా సృష్టించడం వారికి మాములుగా మారిపోయిందని విమర్శలు ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్ కు ఆ పార్టీ నాయకులే ప్రధాన ప్రత్యర్ధులుగా మారుతున్నాఋ. ఒకరి మధ్య ఒకరు సమన్వయం లేకుండా వ్యవహరిస్తూ పార్టీ పరిస్థితిని మరింత దిగజార్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి ఎక్కువగా ఉంది. అధికార పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించి తమ రాజకీయ ప్రత్యర్ధుల ఉనికి లేకుండా చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నెలకొన్న లోపాలను కెసిఆర్ మూడు సర్వేలను చేస్తున్నాడు. ఆ సర్వే ఫలితాలు ఆధారంగా పార్టీలోను, ప్రభుత్వంలోను మున్సిపల్ ఎన్నికల్లో గట్టెక్కే విధంగా వ్యవహరిస్తున్నారు.
కానీ ఈ సమయంలో యాక్టివ్ గా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ అధికారులతో కయ్యానికి కాలు దువ్వుతూ మరింత ఇబ్బందికర పరిస్థితులను కొని తెచ్చుకుంటోంది. జనవరి 7వ తేదీన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో పార్టీపరంగా వ్యవహరించాల్సిన విధివిధానాలపై ఇప్పటికీ ఆ పార్టీ దృష్టి పెట్టలేకపోతుంది. పైపెచ్చు ఎన్నికల అధికారులు అంతా అధికార పార్టీకి ఏజెంట్లుగా మారారంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నికల అధికారులు, పోలీసుల పై కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలపై తీవ్రస్థాయిలో దుమారం చెలరేగుతోంది. తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి అధికారులను టార్గెట్ చేసుకుంది. ఎన్నికల సంఘం ప్రకటించిన మున్సిపల్ నోటిఫికేషన్, పోలింగ్ తేదీల పైన కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
రిజర్వేషన్లు ప్రకటించకుండా, వార్డుల విభజన చేయకుండా అసలు ఇప్పటి వరకు ఓటర్ లిస్ట్ ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తోంది. అధికార పార్టీ చెప్పిన తేదీలను యధా విధంగా ఎన్నికల సంఘం ప్రకటించింది అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపణలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ని కలిసిన కాంగ్రెస్ నాయకులు ఎన్నికల తేదీలను మార్చాలంటూ వినతి పత్రాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నికల కమిషనర్ ను టార్గెట్ చేసుకుంటూ అఖిలపక్ష సమావేశం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు బాయ్ కాట్ చేశారు. అలాగే కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సేవ్ నేషనల్, సేవ్ కానిస్టిట్యూషన్ పేరుతో నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ లీడర్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా పోలీస్ కమిషనర్ అంజని కుమార్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మునిసిపల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీ పరిస్థితులు చక్కదిద్దుకోవడం మానేసి ఇలా అధికారులను టార్గెట్ చేసుకుంటూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ముందే తమ ఓటమిని అంగీకరిస్తున్నారా అనే వాదన పెద్ద ఎత్తున వినిపిస్తోంది. కాంగ్రెస్ లో నెలకొంటున్న ఈ పరిస్థితులను టిఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుని తెలంగాణలో ఎదురుగా లేదన్నట్టుగా ముందుకు దూసుకు వెళ్ళిపోతుండగా, కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇలా సొంత పార్టీ నాయకుల పైన అధికారుల పైన నిందలు వేసుకుంటూ కాలం గడుపుతున్నారు.