ఈ దోపిడీ ముఠాతో తస్మాత్ జాగ్రత్త..!
ఏ టైమ్ లో.. ఎక్కడ.. విరుచుకుపడతారో తెలియదు. తెల్లారితో ఎక్కడ దొంగతనం వార్త వినాల్సి వస్తుందో తెలియదు.. అంతలా హైదరాబాద్ శివార్లలను వణికించేసింది ఈ దొంగల ముఠా. కొన్ని నెలలుగా జనాలకే కాదు, ఖాకీలకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేసిన దోపిడీ ముఠా.. గుమన్ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కొన్నాళ్లుగా హైదరాబాద్ శివార్లలో దోపిడీలకు తెగబడుతున్న.. డేంజరస్ గుమన్ గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అవుటర్ రింగ్‌రోడ్డుకు దగ్గరగా ఉండి.. సీసీ కెమెరాల నిఘా కూడా తక్కువగా ఉండే కుంట్లూరు ఏరియాలో గుమన్ గ్యాంగ్ చోరీలకు తెగబడింది. అయితే కొన్నాళ్ల క్రితం నగరం విడిచిపోయిన ఈ గ్యాంగ్ అక్టోబర్‌లో మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. కుంట్లూరు పరిధిలో రెక్కీ నిర్వహిస్తూ.. మళ్లీ దోపిడీలు మొదలెట్టింది. ఆరు దోపిడీలు చేసిన రాచకొండ పోలీసులకు సవాల్‌గా విసురుతోంది.
గుమన్ గ్యాంగ్ కోసం రెండు నెలల పాటు రాచకొండ పోలీసులు ఆరు రాష్ట్రాల్లో గాలించి.. చివరకు వీరి కదలికలు మహారాష్ట్రలోని ఓక్లా, హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా పరిసర ప్రాంతాల్లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కుంట్లూరులో మొదటిసారి దోపిడీ చేశాక ఈ గ్యాంగ్.. రైళ్లో నిజమాబాద్ మీదుగా మహారాష్ట్ర ఓక్లాకు పారిపోయింది. నవంబర్ 20న తిరిగివచ్చి.. కుంట్లూరు సమీపంలోనే విజయవాడ జాతీయ రహదారి పై ఉన్న పలు హోటళ్లలో దిగి... రాత్రి 11గంటల తరువాత కనకదుర్గానగర్ కాలనీలోకి చొరబడి దోపిడీలు చేశారు.
బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ్ బెంగాళ్‌కు.. అక్కణ్నుంచి దేశంలోని ఇతర రాష్ట్రాలకూ పాకిపోయింది గుమన్ గ్యాంగ్. ప్రధాన నగరాల్లో శివారు ప్రాంతాల్లో నివాసం ఏర్పర్చుకుంటున్నారు. నిర్మానుష్యమైన ప్రాంతాల్లో టెంట్‌లు వేసుకొని రోడ్డు పక్కన బ్లాంకెట్‌లు, బొమ్మలు అమ్ముతుంటారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్రల్లో ఉండే ఈ గ్యాంగ్ కన్ను.. తెలంగాణా పై పడింది. నగరానికి వచ్చిన గుమన్ గ్యాంగ్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు ప్రాంతాన్ని ఎంచుకున్నారు. గుమన్ గ్యాంగ్ పై ఒక్క హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఆరు కేసులు ఉండగా, తెలంగాణాలోని ఇతర ప్రాంతాలతో పాటు పక్క రాష్ట్రాల్లోనూ ఈ ముఠా పై కేసులున్నట్లు అధికారులు చెబుతున్నారు.