గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఉల్లి ధరలు... కిలో 20 రూపాయలు...?
గడచిన మూడు నెలలుగా ఉల్లి సామాన్యులకు కోయకుండానే కన్నీళ్లు తెప్పించిన విషయం తెలిసిందే. వరదలు, భారీ వర్షాలతో మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలలో పంట దిగుబడులు తగ్గడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉల్లి ధరలు ఈ సంవత్సరం పెరిగాయి. ఒక దశలో కిలో ఉల్లి 150 రూపాయల నుండి 200 రూపాయల వరకు పలకటంతో సామాన్యులు ఉల్లి వినియోగాన్ని పూర్తిగా తగ్గించేశారు.
ఉల్లి దెబ్బకు కొన్ని ప్రముఖ హోటళ్లు కూడా ఉల్లి దోశను తమ మెనూ నుండి తొలగించాయి. పానీ పూరీ బండ్లు, సాధారణ హోటళ్లు ఉల్లిని ఉపయోగించటమే మానేశారు. కానీ గడచిన కొన్ని రోజుల నుండి ఉల్లి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్త పంట మార్కెట్ లోకి వస్తూ ఉండటంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో కిలో ఉల్లి 40 రూపాయల నుండి 80 రూపాయల వరకు పలుకుతోంది.
పూర్తి స్థాయిలో పంట ప్రజలకు అందుబాటులోకి వస్తే ఉల్లి ధర మరింత తగ్గుతుందని వ్యాపారులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లలో ఉల్లి 50 రూపాయల నుండి 60 రూపాయలు పలుకుతోంది. జనవరి నెల చివరినాటికి ఉల్లి ధర పూర్తిగా తగ్గుతుందని కిలో ఉల్లి 20 రూపాయలు లేదా అంతకంటే తక్కువ పలికే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
మరికొన్ని రోజులు ప్రజలు ఓపిక పడితే ఉల్లి ధరల నుండి ప్రజలకు పూర్తిగా ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఉల్లి ధరలు తగ్గుతూ ఉండటంపై ప్రజల నుండి కూడా సంతృప్తి వ్యక్తమవుతోంది. మరో 20 రోజులు ఓపిక పడితే ఉల్లి సమస్యలు పూర్తిగా తగ్గుతాయని ఇతర రాష్ట్రాల నుండి ఉల్లి దిగుమతులు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇన్నిరోజులు ఉల్లి ధరల వలన ఇబ్బందులు పడిన సామాన్యులకు ఉల్లిధరలు తగ్గుముఖం పట్టడం గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు.