రాజదానిపై జగన్ సర్కార్ అప్పుడే నిర్ణయం తీసుకుంటుంది : స్పీకర్ తమ్మినేని
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని మార్పు అనే అంశం తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే రాజధాని అధ్యయనం కోసం నియమించిన జిఎన్ రావు కమిటీ ఇప్పటికే నివేదిక అందించింది. ఇక తాజాగా బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం కోసం సాంకేతిక అధ్యయనం చేసి రిపోర్టును అందజేసింది. అయితే రాజధాని అధ్యయనం కోసం ప్రభుత్వం నియమించిన రెండు కమిటీలు జగన్ అసెంబ్లీ వేదికగా జగన్ ప్రకటించిన 3 రాజధానిల నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఉండడంతో... అమరావతిలో అభివృద్ధి సాధ్యం కాదు అని చెప్పడం లాంటి పలు విషయాలను నివేదికలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బోస్టన్ కమిటీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇకపోతే తాజాగా బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక పై స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన రిపోర్టుని స్టడీ చేశాక క్యాబినెట్ మీటింగ్ లోకి వెళ్తుందని తమ్మినేని సీతారాం తెలిపారు. క్యాబినెట్ మీటింగ్ లో బోస్టన్ కమిటీ నివేదికపై చర్చించిన తర్వాత అసెంబ్లీ లో తీర్మానం ద్వారా రాజధాని మార్పు నిర్ణయం తీసుకుంటామని తమ్మినేని సీతారాం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ప్రజా రాజధాని ఆశిస్తున్నారని... వైసీపీ ప్రభుత్వం కూడా ప్రజాభీష్టం మేరకే రాజధాని నిర్మిస్తోందని స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు స్పీకర్ తమ్మినేని సీతారాం.
చంద్రబాబు స్వలాభం కోసమే అమరావతి నిర్మించారని... అందుకనే అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ కు చంద్రబాబు ప్రభుత్వం పాల్పడింది అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆరోపించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన తర్వాత రాజధాని నిర్మించాలని చంద్రబాబునాయుడు అనుకున్నారు... అందుకే అమరావతి నిర్మాణానికి ముందే అక్కడ భారీగా భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. అమరావతిలో భూములు కొనుగోలు చేసి రాజధాని నిర్మిస్తే కోటీశ్వరుడు కావచ్చని ఉద్దేశంతోనే చంద్రబాబు అమరావతి నిర్మాణం చేపట్టారని దుయ్యబట్టారు స్పీకర్ తమ్మినేని. ఇప్పటికి కూడా తన బినామీ రాజకీయ పైరవికారులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేందుకు జగన్ ఏ పని చేసిన విమర్శలు చేయడం మొదలుపెట్టారు అంటు విమర్శించారు స్పీకర్ తమ్మినేని.