కెసిఆర్ లో ధైర్యం పెరగడానికి ఆ సర్వేలకు లింక్ ఏంటి ?
గతంతో పోలిస్తే గులాబీ బాస్ కెసిఆర్ లో ధైర్యం ఎక్కువ అయినట్టు గా కనిపిస్తోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సమయం ముంచుకొస్తున్న తరుణంలో పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడుతుంది అంటూ భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా కనిపించకుండా కప్పిపుచ్చే ప్రయత్నం ఏం చేస్తున్నారు. ముందుగా పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపితే ప్రజల్లోకి ఆటోమేటిగ్గా ఆ విషయాన్ని తీసుకు వెళ్ళవచ్చని కెసిఆర్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంపై శనివారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీకి అన్ని సర్వేలు అనుకూలంగా ఉన్నాయని, ఎవరూ ఎటువంటి బెదురు లేకుండా ఎన్నికలకు సిద్ధం కావాలని ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ తరపున 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ లలో పార్టీ నాలుగు సార్లు చేయించిన సర్వే వివరాలను కెసిఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే మున్సిపల్ ఓటర్ జాబితాతో పాటు నూతన మున్సిపల్ యాక్ట్ కు సంబంధించిన కాపీలను నాయకులకు అందించారు. ఈ సమావేశంలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను అప్పగిస్తూ కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు.
ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కార్యకర్తలకు ఆత్మీయ సమావేశాలు నిర్వహించి వారిలో ఉత్సాహాన్ని నింపాలని సూచించారు. తెలంగాణలో బిజెపి ఉనికే లేదని, ఆ పార్టీ మనకు పోటీ అనే అపోహ అంతా వీడాలని కేసీఆర్ సూచించారు. కొత్త నాయకులు అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యేలు ముందుకు వెళ్లాలని సూచించారు. పార్టీ తరఫున అభ్యర్థిని ఎంపిక చేసిన తర్వాత ఎవరు వ్యతిరేకించవద్దని, పార్టీ విజయం కోసం మీరంతా కృషి చేయాలని కెసిఆర్ వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అయితే నిజంగానే సర్వేల్లో టీఆర్ఎస్ కు అనుకూల ఫలితాలు వచ్చాయా లేక కేసీఆర్ కార్యకర్తల్లో ధైర్యం నూరిపోసేందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడా అనేది తెలియాల్సి ఉంది.