మూడు రాజధానులు కాదు త్రిశంకు రాజధాని
మూడు రాజధానుల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. ఏపీకి మూడు రాజధానులు కాదని, త్రిశంకు రాజధానిని ఏర్పాటు చేసిన ఘనత ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది అంటూ పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజధాని కోసం పోరాడుతున్న ప్రజల ఆకాంక్షలు అరెస్టులతో, గృహ నిర్బంధంతోనూ ఆపలేరు అంటూ పవన్ విమర్శలు చేశారు. కేవలం అణిచివేత ధోరణి తో విజయం సాధించాలి అనుకుంటే ఆ భ్రమ నుంచి ముఖ్యమంత్రి బయటకు రావాలంటూ పవన్ సూచించారు.
రెండు వారాలకు పైగా సాగుతున్న ఆందోళన కార్యక్రమాలు మరింత తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో పవన్ ఈ విధంగా స్పందించారు. జగన్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ అమరావతి ప్రాంతాన్ని మరో నందిగ్రామ్ గా మార్చాలని చూస్తోందని జనసేన ఎట్టి పరిస్థితుల్లోనూ చూస్తూ ఊరుకోదు అంటూ పవన్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. విశాఖను రాజధానిగా చేస్తే ఉత్తరాంధ్ర వాసులు కూడా ఒప్పుకోరని, అసలు సంతృప్తిగానే లేరని, పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాయలసీమ వాసులకు సుదూరంగా రాజధానిని ఏర్పాటు చేసి జగన్ ఏమి సాధించాలనుకుంటున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
రాయలసీమకు దూరంగా ఉత్తరాంధ్ర కు ఉపయోగపడకుండా, దక్షిణ కోస్తా వారికి అంతుచిక్కని విధంగా రాజధానిని ఏర్పాటు చేస్తే ఎవరికి ఉపయోగం ఉంటుందో జగన్ సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. ఇలాంటి రాజధానిని ఏర్పాటు చేస్తే అది త్రిశంకు రాజధాని అవుతుందని పవన్ విమర్శించారు. హైదరాబాద్ నుంచి అమరావతి కి తరలి వెళ్ళిన ఉద్యోగులంతా ఇప్పుడే కాస్త కుదుటపడుతున్నారని వారిని మరల రాజధాని పేరుతో వేరే ప్రాంతానికి బదిలీ చేస్తే ఆ ఉద్యోగుల కుటుంబాలు ఎంత ఇబ్బంది పడతాయో జగన్ ఆలోచించుకోవాలని సూచించారు. పవన్ వ్యాఖ్యలను చూస్తుంటే అమరావతి లో జరుగుతున్న ఆందోళనను బాగా ఉపయోగించుకోవాలని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది.