ఉల్లి వినియోగదారులకు శుభవార్త... భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు...!
గడచిన రెండు మూడు నెలల నుండి ఉల్లి ధరలు సామాన్యులను తీవ్రంగా భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఉల్లి ధరల దెబ్బకు కొన్ని రెస్టారెంట్లు, హోటళ్ల నుండి ఉల్లి దోశను మెనూ నుండి తొలగించాయి. గడచిన కొన్ని రోజుల నుండి ఉల్లి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో కిలో ఉల్లి 35 రూపాయల నుండి 70 రూపాయల వరకు పలుకుతోంది.
ఇలాంటి సమయంలో కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి రామ్ విలాన్ పాశ్వాన్ ఒక శుభవార్త చెప్పారు. నిన్న రాంవిలాస్ పాశ్వాన్ మాట్లాడుతూ విదేశాల నుండి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నామని ఆయా రాష్ట్రాలు డిమాండ్ ను బట్టి ఆర్డర్ పంపిస్తే ఉల్లి పంపిస్తామని తెలిపారు.విదేశాల నుండి 12,000 మెట్రిక్ టన్నుల ఉల్లి వచ్చిందని మంత్రి తెలిపారు. ఈ నెలాఖరు లోపు 40,000 మెట్రిక్ టన్నుల ఉల్లి వస్తుందని చెప్పారు.
ఇప్పటికే ఉల్లి ధరలు తగ్గగా కేంద్రం విదేశాల నుండి ఉల్లి దిగుమతి చేసుకొని సరఫరా చేస్తూ ఉండటంతో ఉల్లిధరలు భారీగా తగ్గుముఖం పట్టనున్నాయని తెలుస్తోంది. ఈ నెలాఖరుకు ఉల్లి కిలో 20రూపాయలు పలికినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. విదేశాల నుండి ఉల్లి దిగుమతి పెరుగుతూ ఉండటంతో ఉల్లి ధరలు తగ్గుతున్నాయని మంత్రి చెప్పారు. హైదరాబాద్, కర్నూలు మార్కెట్లలో కూడా ఉల్లి ధరలు భారీగా తగ్గాయని సమాచారం.
కర్నూలు మార్కెట్ లో కిలో ఉల్లి ధర 35 రూపాయలు పలుకుతోంది. మరోవైపు మహారాష్ట్ర రాష్ట్రం నుండి భారీగా ఉల్లి అందుబాటులోకి వస్తోంది. ఈ నెలాఖరుకు ఉల్లి కిలో 20రూపాయలు లేదా అంతకంటే తక్కువకు లభ్యమయ్యే అవకాశం ఉందని సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో ఉల్లి ధరలు తగ్గినా ఈశాన్య రాష్ట్రాల్లో ఉల్లి 50 రూపాయలకు పైగా పలుకుతోంది. హోల్ సేల్ మార్కెట్లో ఉల్లి ధరలు తగ్గుతూ ఉండటంతో రిటైల్ మార్కెట్లో కూడా ఉల్లి ధరలు తగ్గుతున్నాయి.