సుకన్య సమృద్ధి అకౌంట్ తో ఎన్నో లాభాలు... ఖాతాదారులు తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలివే... !

Reddy P Rajasekhar

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ఒకటి. ఆడపిల్లల ఆర్థిక భద్రతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ పథకంలో డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో చేరాలంటే ఖచ్చితంగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి. 
 
బ్యాంక్ లేదా పోస్టాఫీస్ లో సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవచ్చు. బ్యాంకులో, పోస్టాఫీసులో ఈ స్కీమ్ కు ఒకటే వడ్డీ లభిస్తుంది. సుకన్య సమృద్ధి అకౌంట్ ను ఇంట్లో ఇద్దరు ఆడపిల్లల పేరుపై తెరవొచ్చు. అమ్మాయి వయస్సుతో పని లేకుండా ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లుగా ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గరినుండి 21 సంవత్సరాల పాటు ఈ అకౌంట్ కొనసాగుతుంది. 
 
అకౌంట్ ఓపెన్ చేసిన రోజు నుండి 15 సంవత్సరాల పాటు డబ్బులు డిపాజిట్ చేస్తూ ఉండాలి. 15సంవత్సరాల తరువాత డబ్బు డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఖాతాలోని డబ్బుపై 21 సంవత్సరాల మెచ్యూరిటీ వరకు వడ్డీ లభిస్తుంది. అకౌంట్ నుండి ముందుగా డబ్బు విత్ డ్రా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ముందుగా విత్ డ్రా చేసుకుంటే ఉన్నత చదువు, అమ్మాయి పెళ్లి కోసం ఆ డబ్బు ఉపయోగించాలి. పెళ్లి కొరకు డబ్బు తీసుకోవాలనుకుంటే అమ్మాయికి 18ఏళ్లు నిండి ఉండాలి. 
 
ఈ ఖాతాపై ప్రస్తుతం 8.4 శాతం వడ్డీ లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు వడ్డీ రేటును సవరిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో 250 రూపాయల నుండి 1,50,000 వరకు సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో డిపాజిట్ చేయవచ్చు. నెలకు 1,050 రూపాయలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో 5,00,000 రూపాయలు పొందవచ్చు. నెలకు 12,000 రూపాయలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో 75 లక్షల రూపాయలు పొందవచ్చు. ఈ స్కీమ్ పై ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతా కలిగిన అమ్మాయి మరణిస్తే అకౌంట్ వెంటనే క్లోజ్ అవుతుంది. పాప డెత్ సర్టిఫికెట్ ను బ్యాంకులో లేదా పోస్టాఫీసులో అందజేసి డబ్బు వెనక్కు తీసుకోవచ్చు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: