అత్యాశకు పోయారా? నడిరోడ్డున పడాల్సిందే..!
రాత్రికి రాత్రే కోటీశ్వరులయిపోవాలనే అత్యాశ జీవితాలను నాశనం చేసి నడిరోడ్డుకు ఈడుస్తుంది. సామాన్యుల బలహీనతే వరంగా మార్చుకుంటున్న కేటుగాళ్లు. లక్షలకు లక్షలు దోచేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో అలాంటి ఘటనలే ఒకటీ రెండు కాదు అనేకం వెలుగులోకి వచ్చాయి. డబ్బులు వస్తాయని ఆశపడ్డ నిరుపేద కుటుంబాలు కాస్తా రోడ్డున పడ్డాయి.
తెలంగాణలో రోజుకో చోట లాటరీ పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. బాల్కొండలో సైబర్ కేటుగాళ్ల మోసానికి ఓ రైతు కుటుంబం బలైన ఘటన మరువక ముందే మరో మోసం వెలుగు చూసింది. ఆత్యాశకు పోయి ఆస్తులు, బంగారం అమ్ముకున్న ఓ కార్మికుడి కుటుంబం 16 లక్షలు పోగొట్టుకొని నడిరోడ్డున పడింది.
నిజమాబాద్ ఆర్మూర్‌కు చెందిన అశోక్ ఉన్న ఊరిలో ఉపాధి లేక గల్ఫ్ దేశానికి ఉపాధి కోసం వెళ్లాడు. మూడేళ్లుగా లేబర్ పనులు చేసుకుంటూ.. చేపూరు గ్రామంలోనే ఉంటున్న భార్య ముత్తెమ్మతో పాటు ఇద్దరు ఆడపిల్లలను పోషించుకుంటున్నాడు. అంతవరకు బాగానే ఉన్నా ఫోనుకు వచ్చిన ఓ మెస్సేజ్ ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది.
అశోక్ ఫోనుకు 46 లక్షల రూపాయల లాటరీ తగిలిందని మెసేజ్ వచ్చింది. కాసేపటికే అశోక్ ఫోన్‌కు కాల్ చేసిన ఓ వ్యక్తి.. లాటరీ డబ్బులు రావాలంటే 16 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టాలని చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి మాటలు నమ్మిన అశోక్ మొదటగా తన వద్ద దాచుకున్న ఐదు లక్షల రూపాయలను అతనికి ట్రాన్స్‌ఫర్ చేశాడు. మిగిలిన 11 లక్షల రూపాయల కోసం భార్య, పిల్లల నగలు అమ్మగా.. సరిపోకపోవడంతో అప్పు చేసి మరీ డబ్బులు పంపారు.
రోజులు గడుస్తున్నా.. వారికి రావాల్సిన 46 లక్షల రూపాయలు అకౌంట్‌లో పడలేదు. ఫోన్ చేసిన వ్యక్తి నెంబరు స్విచ్ ఆఫ్ వస్తోంది. దీంతో మోసపోయామని తెలుసుకున్న ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి మోసాలు ఇటీవల కాలంలో ఎన్నో జరిగాయని పోలీసులు చెప్పడంతో.. కన్నీటి పర్యంతమైంది అశోక్ భార్య.
మొత్తం మీద.. లాటరీ పేరుతో మోసపోయిన ఆ కుటుంబం ప్రస్తుతం నడిరోడ్డున పడింది. లాటరీ తగిలిందని ఫోన్ కాల్స్ వస్తే నమ్మవద్దని.. వెంటనే తమకు సమాచారం అందించాలంటున్నారు పోలీసులు. అందుకే లాటరీ పేరుతో కాల్స్, మెస్సేజ్స్ వస్తే అసలు పట్టించుకోకండి.. బీ అలర్ట్.