టీడీపీలో ఈ వికెట్లు టపా టపా రాలుడేనా...?
ఏపీ సీఎం జగన్ దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఏర్పడుతోంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఈ పరిణామాలు గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా జగన్ ప్రభుత్వం రాజధాని మార్పు, మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు ఇలా అనేక కీలక బిల్లులను అసెంబ్లీలో ఆమోదించుకుని ప్రతిపక్షానికి చుక్కలు చూపిస్తోంది. దీనికి ముందుగానే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టిడిఎల్పి విస్తృతంగా చర్చించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాకపోవడంపై పార్టీలో ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో ఉండగా వారిలో ఏడుగురు ఈ సమావేశాలకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. వీరిలో ఇద్దరు ఎప్పటికీ చంద్రబాబుపై తిరుగుబాటు చేసి పార్టీకి దూరంగా ఉంటున్నారు. మిగతా వారు వ్యక్తిగత కారణాలతో ఈ సమావేశానికి హాజరు కావడంలేదని తమకు ముందుగానే సమాచారం ఇచ్చారని టిడిపి పైకి చెప్పుకుంటోంది. ఈ ఐదుగురు లో కీలకమైన గంటా శ్రీనివాసరావు చాలాలకమలాగా బీజేపీలో చేరాలని చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వాసుపల్లి గణేష్, బెందాళం అశోక్, అనగాని సత్యప్రసాద్, ఆదిరెడ్డి భవానిలు ఇంత కీలక సమయంలో బాబు నిర్వహించిన సమావేశానికి హాజరు కాకపోవడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
వీరంతా ముందుగానే అధినేతకు సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేయడాన్ని ఈ ఐదుగురిలో ముగ్గురు బహిరంగంగానే సమర్థించారు. ఈ మేరకు తీర్మానం కూడా అధినేత చంద్రబాబుకు పంపించారు. అలాగే 12 మంది ఎంఎల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరు కాకపోవడంతో వైసిపి ప్రవేశపెట్టే బిల్లుకు వీరంతా మద్దతు తెలుపుతున్నారా ? మండలిలో బిల్లు నగ్గించేందుకే ఇలా దూరంగా ఉంటున్నారా అనే విషయంపై టిడిపి లోతుగా పరిశీలిస్తోంది.
ప్రస్తుతం జనసేన బిజెపి పొత్తు పెట్టుకోవడంతో వీరంతా బిజెపి వైపు వెళ్ళిపోతున్నారా లేక అధికార పార్టీ వైసీపీకి అనధికారికంగా మద్దతు తెలుపుతున్నారా అనే సందేహం టిడిపిలో నెలకొంది. ఏది ఏమైనా జగన్ తీసుకున్న నిర్ణయం కారణంగా ముందు ముందు టీడీపీ నుంచి వలసలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అదే కనుక జరిగితే టిడిపి మరింత బలహీనపడే అవకాశం లేకపోలేదు.