జేడీ సీటుకు ఎర్త్ పెట్టేసిన పవన్ ?
జనసేన బిజెపి పొత్తుపై ఏపీ బీజేపీ నేతలు, జనసేన నాయకులు ఆనందంగా ఉన్నారు. జనసేన బలంతో ఏపీలో తాను రాజకీయంగా మరింత పుంజుకోవచ్చని బిజెపి చూస్తుండగా... బిజెపి అధికార బలంతో మరింతగా తాము మరింతగా తాము ఎదగవచ్చని జనసేన లెక్కలు వేస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా... ఈ రెండు పార్టీల పొత్తు కారణంగా కొన్నిచోట్ల వివాదాలు, కొంతమంది నాయకుల రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటి నుంచే అనేక రకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి.
జనసేన పార్టీలో యాక్టివ్ గా ఉంటూ విశాఖ రాజకీయాలపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు గందరగోళంలో పడినట్టు తెలుస్తోంది. విశాఖ లోక్ సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లోజేడీ ఓటమి చెందినా వచ్చే ఎన్నికల నాటికి బలపడే అవకాశం ఉందని భావిస్తూ... క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటూ పూర్తిగా విశాఖపై జేడీ లక్ష్మీనారాయణ దృష్టి సారించారు. అయితే ఇప్పుడు బిజేపి తో పొత్తు కారణంగా గతంలో విశాఖ నుంచి పోటీ చేసిన పురంధరేశ్వరి కూడా ఇదే స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలని చూస్తున్నారు.
అయితే జనసేన బిజెపి పొత్తు లో భాగంగా విశాఖ ఎంపీ సీటు ఎవరికి ఇస్తారని దానిపై తీవ్ర స్థాయిలో అప్పుడే చర్చ జరుగుతోంది. విశాఖ సీటు వదులుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ ఒప్పుకోదు. ఎందుకంటే గతంలో ఇక్కడ నుంచి బిజెపి ఎంపీ గా కంభంపాటి హరిబాబు గెలుపొందారు. మొన్నటి ఎన్నికల్లో దగ్గుబాటి పురంధరేశ్వరి కోసం కంభంపాటి హరిబాబు త్యాగం చేసి మరి ఆమెకు సీటు ఇచ్చారు. అంతకు ముందు ఆమె కాంగ్రెస్ తరపున విశాఖలో ఎంపీగా పోటీ చేసి నెగ్గి ఆ తరువాత కాంగ్రెస్ లో కేంద్ర మంత్రి కూడా అయ్యారు.
ఇప్పుడు కూడా ఆమె గత వైభవాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తిస్థాయిలో ఈ స్థానంపై దృష్టి పెట్టారు. అయితే మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా బరిలోకి దిగిన జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణ ప్రజల్లో మంచి గుర్తింపు సాధించారు. ఎన్నికల్లో ఓటమి చెందినా ఆయనపై ప్రజల్లో సానుభూతి ఉంది. ఈ పరిస్థితుల్లో బిజెపి అభ్యర్థి గా పురందరేశ్వరి రంగంలోకి దిగితే జనసేనకు బీజేపీ హ్యాండ్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.బీజేపీ పెద్దలు గట్టిగా ఈ సీటు విషయంలో చెప్పినా కాదనలేని పరిస్థితి పవన్ ది. అంటే మెల్లి మెల్లిగా పవన్ ను విశాఖ నుంచి తప్పించి వేరే ప్రాంత బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది.