నిర్భయ దోషుల ఉరిశిక్ష ప్రశ్నార్థకం  !

NAGARJUNA NAKKA

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఢిల్లీ కోర్టు రెండోసారి డెత్ వారెంట్ ఇచ్చినా.. ఆ తేదీన కూడా శిక్ష అమలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటివరకు ఒక్క దోషి మాత్రమే క్షమాభిక్ష పెట్టుకోగా.. ఇద్దరు మాత్రమే క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో మిగతావారికి న్యాయపరమైన ఆప్షన్స్ మిగిలే ఉన్నాయి. అవి అయ్యేదాకా ఉరిశిక్ష అమలు జరగదని సుప్రీంకోర్టు తీర్పుల్ని బట్టి అర్థమవుతోంది. 

 

ఒకే ప్రదేశంలో నేరం చేసిన దోషులందర్నీ.. ఒకేసారి ఉరితీయాలని సుప్రీంకోర్టు 1982లో ఇచ్చిన జడ్జిమెంట్ చెబుతోంది. అదే విధంగా రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిన రోజు నుంచి ఉరి తీసే రోజు వరకు పద్నాలుగు రోజులు సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు 2014లో ఇచ్చిన తీర్పు చెబుతోంది. దీంతో నిర్భయ కేసులో నలుగురు దోషుల ఉరి అనుమానమేనని స్పష్టంగా తెలుస్తోంది. 

 

నిర్భయ దోషుల్లో ఇప్పటివరకు  ముకేష్ కుమార్ సింగ్, వినయ్ శర్మ మాత్రమే క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో వీరిపరంగా న్యాయపరంగా ఎలాంటి అవకాశాలు లేనట్టే. ఇక ముకేష్ కుమార్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ మాత్రమే తిరస్కరణకు గురైంది. వినయ్ శర్మకు ఇంకా క్షమాభిక్ష పెట్టుకునే అవకాశం ఉంది. దోషి వినయ్ కుమార్ క్షమాభిక్ష పిటిషన్ కు వెళ్లినా.. అది తాను దాఖలు చేయలేదని అతడు స్పష్టం చేశాడు. ఇప్పుడు వివాదాస్పద క్షమాభిక్ష పిటిషన్ తో పాటు వినయ్ కుమార్ పంపిన లెటర్ కూడా ప్రెసిడెంట్ దగ్గరే పెండింగ్ లో ఉంది. ఇది ఇంకా తేలాల్సి ఉంది. 

 

మరో ఇద్దరు దోషులు పవన్ గుప్తా, అక్షయ్ కుమార్ సింగ్ ఇంతవరకూ క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయలేదు. దీనిపై వాదనలు జరిగాక.. ఇంకా క్షమాభిక్ష పిటిషన్లు కూడా పెట్టుకోవాల్సి ఉంది. కాబట్టి ఫిబ్రవరి 1న నిర్భయ దోషులకు ఉరిశిక్ష అనుమానమేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: