పవన్ కు అయిపోయిందా ? ..  ఇక మిగిలింది  సుజనాయేనా  ?

Vijaya
మూడు రాజధానుల విషయంలో బిజెపి అగ్ర నాయకత్వం నుండి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఫుల్లుగా క్లారిటి వచ్చేసినట్లుంది.  అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన విషయంలో  జనసేనాని తోక  ముడిచేశారు.  ఇక మిగిలింది ఫిరాయింపు ఎంపి సుజనా చౌదరి మాత్రమే.  ఇప్పటికే సుజనాకు కూడా కేంద్ర నాయకత్వం క్లారిటి ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ డోసు సరిపోయినట్లు లేదు.

ఇంతకీ విషయం ఏమిటంటే రాజధానిని అమరావతి నుండి తరలిస్తే ప్రళయం సృష్టిస్తానని పవన్ చేసిన ప్రతిజ్ఞలు అందరికీ తెలిసిందే. బిజెపితో పొత్తు తర్వాత ఢిల్లీకి వెళ్ళేముందు మీడియాతో  మాట్లాడుతూ జగన్ విషయాన్ని ఢిల్లీ నాయకత్వంతో కూడా మాట్లాడుతానని చెప్పారు. పవన్ చెప్పింది ఎలాగుందంటే  రాజధాని తరలింపు విషయంలో జగన్ కు మూడినట్లే అన్న భ్రమ కల్పించారు.

సీన్ కట్ చేస్తే  ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీడియాతో మాట్లాడుతూ  రాజధానుల విషయం పూర్తిగా  రాష్ట్రప్రభుత్వం పరిధిలోని అంశమే అని మొహం వేలాడేసుకుని చెప్పిన విషయం అందరూ చూసిందే.  ఢిల్లీకి వెళ్ళేముందు చేసిన ప్రకటనకు తర్వాత ప్రకటనకు మధ్య ఏమి జరిగింది ?

ఏమి జరిగిందంటే కేంద్రమంత్రి కానీ నడ్డా కానీ పవన్ కు ఫుల్లుగా క్లాసు పీకారట. రాజధాని ఏర్పాటు విషయంలో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చేశారట. రాష్ట్రప్రభుత్వ అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారట. ఇదే విషయాన్ని రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు ఎప్పటి నుండో చెబుతున్నారు. అయినా పవన్ వినలేదు. ఇదే విషయాన్ని కేంద్రంలోని ముఖ్యులు చెప్పిన తర్వాత మళ్ళీ నోరెత్తలేదు.

ఇక సుజనా విషయం తీసుకుంటే ఈయన కూడా పవన్ మాదిరిగానే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాజధానిని అమరావతి నుండి అంగుళం కూడా కదల్చేందుకు తాను ఒప్పుకోనంటు బెదిరించారు. తనిష్టం వచ్చినట్లు జగన్ చేస్తుంటే కేంద్రం చూస్తు ఊరుకోదంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. జీవిఎల్ స్పష్టత ఇస్తున్నా సుజనా మాత్రం తన ధోరణిలోనే మాట్లాడుతున్నారు. అంటే సుజనాకు కూడా ఫుల్లు డోసు పడాలేమో ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: