నారా లోకేశ్ ఎమ్మెల్సీగా చట్టసభల్లో అడుగుపెట్టాడు. ఆ తరవాత ఎమ్మెల్యే అవుదామన్నా మంగళగిరిలో ఓడిపోయాడు. అయితే ఎమ్మెల్సీ అయిన కారణంగానే ఇంకా అసెంబ్లీప్రాంగణంలో ఉండగలుగుతున్నాడన్నది నిజం. ఇదే మాట అంటున్నారు మంత్రి కొడాలి నాని. నారా లోకేష్‌కు రాజకీయ భిక్ష పెట్టింది దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.
అసలు శాసన మండలి లేకపోతే చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మంత్రి అయ్యే వారా అని కొడాలి నాని ప్రశ్నించారు. 1983లో ఉన్నటువంటి బ్యాచే మళ్లీ మండలిలో చేరిందని కొడాలి నాని విమర్శించారు. అందుకే అప్పట్లో ఎన్టీఆర్ మండలిని రద్దుచేశారని గుర్తుచేశారు. అయితే మంచి సలహాలు ఇస్తారనే ఉద్దేశంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి శాసనమండలిని పునరుద్ధరించారని కొడాలి నాని తెలిపారు.
ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవలేని లోకేశ్‌కు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్సార్ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మండలిని తీసేయాలనే అంశాన్ని కచ్చితంగా ఆలోచించాలని కొడాలి నాని కోరారు. చంద్రబాబు మండలి చైర్మన్‌కు డైరెక్షన్స్ ఇచ్చారని.. ఇలాంటి పనులు చేయడానికి ఆయనకు సిగ్గు లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు తాగి వచ్చారో.. ఇంకెవరు తాగొచ్చారో తెలియదని.. యనమల రామకృష్ణుడుతో సహా టీడీపీ నేతలకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయాలని కొడాలి నాని అన్నారు.
యనమల పేరెత్తితే వెన్నుపోటు గుర్తుస్తోందన్నారు. అలాంటి వ్యక్తి తమకు సలహాలు ఇవ్వడం ఏమిటని కొడాలి నాని నిలదీశారు. మండలిలో టీచర్, పట్టభద్ర ఎమ్మెల్సీల్లో చాలా మంచివారున్నారని కొడాలి నాని తెలిపారు. వారితోపాటు.. బీజేపీ ఎమ్మెల్సీలు కూడా వికేంద్రీకరణ బిల్లు ఆపొద్దని విజ్ఞప్తి చేశారని కొడాలి నాని గుర్తుచేశారు. పెద్దల సభ అంటే సలహాలు, సూచనలు ఇచ్చి బిల్లును ఆమోదించాలని కొడాలి నాని తెలిపారు.
మరింత సమాచారం తెలుసుకోండి: