ఇంత చిత్తుగా ఓడినా మళ్లీ ఇవేం మాటలు రేవంతూ...?
కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజల మీదకు మంత్రులను ఆంబోతుల్లా వదిలారంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతే మీ పదవులు ఊడిపోతాయంటూ సీఎం కేసీఆర్ మంత్రులను బ్లాక్ మెయిల్ చేశారని అన్నారు. పార్టీ కార్యాలయం నుండి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల ఫలితాలను టీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలపై దాడులు చేసి, బెదిరింపులకు పాల్పడి తిప్పుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. పోలీసులు, డబ్బులు, మద్యం అండతో టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిందని రేవంత్ రెడ్డి చెప్పారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ స్వంతంత్రులకు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలని మద్దతు ఇచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులు చూసిందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. నియమ నిబంధనలను ఉల్లంఘించి ఎన్నికల్లో గెలిచారని అన్నారు. గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించకుండా కోంపల్లిలో టీఆర్ఎస్ చంద్ర శ్రీశైలం యాదవ్ ఓడిపోతే బ్యాలెట్లు మాయం చేసి చంద్ర శ్రీశైలం యాదవ్ గెలిచినట్టుగా ప్రకటించారని అన్నారు. ఎర్రబెల్లి ఓట్లు వేయకపోతే మీ అంతు చూస్తామని బెదిరించారని రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రతిపక్ష నేతలను గెలిపిస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వమని నేతలకు కేటీఆర్ చెప్పారని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రజల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగు మున్సిపాలిటీలలో మాత్రమే విజయం సాధించింది కాబట్టి ఘోర పరాజయం పాలైంది కాబట్టి ఓటమిని అంగీకరించలేక రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని ఎన్నికల్లో ఇంత చిత్తుగా ఓడిపోయినా మరలా ఇవేం మాటలు రేవంతూ అని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.