మండలి ఓటింగ్ ముందే చెవిరెడ్డి సభలోంచి బయటకెందుకెళ్ళారంటే ?

Reddy P Rajasekhar

ఈరోజు అసెంబ్లీలో శాసన మండలి తీర్మానంపై ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. 18 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. శాసన మండలి రద్దు తీర్మానం ఆమోదంపై ఓటింగ్ కు 18 మంది వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండటం గురించి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓటింగ్ కంటే ముందే అసెంబ్లీ నుండి బయటకు వెళ్లిపోయారు. అసెంబ్లీ నుండి బయటకు వెళ్లక ముందు అసెంబ్లీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శాసన మండలి రద్దు తీర్మానం గురించి స్పందించారు. 
 
శాసన మండలి రద్దు బిల్లును ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటం కొరకు మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో సభలో ప్రవేశపెట్టాల్సి వచ్చిందని అన్నారు. వై యస్ రాజశేఖర్ రెడ్డి శాసన మండలిని స్పిరిట్ గా ఉంటుందని తెచ్చారని టీడీపీ సభ్యులు శాసన మండలిని ఆల్కహాల్ గా మార్చారని అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు పర్సనల్ ఇంట్రెస్ట్ ల కోసం సభ నడుపుతూ పబ్లిక్ ఇంట్రస్ట్ లను గాలికొదిలేశారని అలాంటప్పుడు శాసన మండలి అవసరమా అని ప్రశ్నించారు. 
 
శాసన మండలిలో చట్టాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని అది శాసన మండలే తప్ప శాసన తీర్మాన మండలి కాదని అన్నారు. పెద్దల సభలను గౌరవించాలని ప్రజాస్వామ్యానికి విలువలు ఇవ్వాలని సీఎం జగన్ బిల్లును పెద్దల సభకు పంపారని అన్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేని సభ విలువలను దిగజార్చే మండలి ఎందుకని చెవిరెడ్డి ప్రశ్నించారు. 
 
కానీ శాసన మండలి రద్దు తీర్మానం గురించి స్పందన వ్యక్తం చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓటింగ్ కు హాజరు కాకపోవడంతో జగన్ కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి ఎందుకు హాజరు కాలేదని టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తుండగా చెవిరెడ్డి మిగతా ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోవడానికి కారణం తెలిసింది. జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో చెవిరెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లగా ఈలోగా ఓటింగ్ కోసం తలుపులేసేశారు. తలుపులు వేసిన తరువాత ఎవరినీ కూడా లోపలికి అనుమతించకపోవడంతో చెవిరెడ్డి, ఎమ్మెల్యేలు ఓటింగ్ కు హాజరు కాలేదని తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వలనే ఓటింగ్ కు హాజరు కాలేదని అంతకు మించి మరే కారణం లేదని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: