డి.శ్రీనివాస్ వ్యూహాలకు ఖంగుతిన్న కే.సి.ఆర్!!

Sudhakar L

తెలంగాణలో టీఆర్ఎస్‌కు ఎదురులేదన్నది తిరుగులేని వాస్తవం. అసెంబ్లీ ఎన్నికలు సహా.. నిన్న మొన్నటి మున్సిపల్ ఎన్నికల వరకు అన్నింటిలోనూ... గులాబీ జెండా రెపరెపలాడింది. అయితే నిజామాబాద్‌లో మాత్రం టీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు ఇస్తున్నారు. నిజామాబాద్‌లో కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కవితపై తన కుమారుడు అరవింద్‌ను గెలిపించుకోవడంలో తెర వెనుక వ్యూహాలు రచించి సక్సెస్ సాధించారు డి.శ్రీనివాస్. 

 

ఇక అప్పటి నుంచి టీఆర్ఎస్‌ను ఏదో రకంగా కౌంటర్ ఇస్తూనే వస్తున్నారు డి.శ్రీనివాస్ గారు. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ నిజామాబాద్ పరిధిలోనే డీఎస్ వ్యూహాలు ఫలించాయనే  ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 60 స్థానాలు ఉండగా... 28 స్థానాలు బీజేపీ సొంతం చేసుకుంది. మరికొన్ని సీట్లు బీజేపీ ఖాతాలో పడితే... నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమలం ఖాతాలో పడేది. 

 

ఎంఐఎం, ఎక్స్ అఫీషియో సభ్యుల సహకారంతో టీఆర్ఎస్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీటును కైవసం చేసుకుంది. ఇక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తరువాత నిజామాబాద్‌లో పోస్టుమార్టం చేపట్టిన టీఆర్ఎస్ నేతలు, ఈ ఎన్నికల్లోనూ డీఎస్ కారణంగానే టీఆర్ఎస్‌ దెబ్బతిన్నదనే అనుమానం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తన తండ్రి అయిన డీఎస్ సూచనలతోనే బీజేపీ ఎంపీ అరవింద్ కార్పొరేషన్‌లో మెజార్టీ సీట్లు బీజేపీ ఖాతాలో పడేలా చేశారనే ప్రచారం కూడా సాగుతోంది. 

 

మొత్తానికి టీఆర్ఎస్‌కు పక్కలో బల్లెంలా మారుతున్న డీఎస్, తనకు సమయం దొరికినప్పుడల్లా నిజామాబాద్‌లో తన సత్తా చూపిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇది ఓ పట్టాన టీఆర్ఎస్ కు మింగుడు పడటం లేదని, పలువురు రాజకీయ ఉద్దండుల విశ్లేషణ. కేంద్రం స్థాయిలో తమ ఉనికిని వినిపిస్తున్న కే.సి.ఆర్ గళం డి.యస్ దగ్గర మాత్రం ఎందుకు బెరుకుతుందనే విషయం సదరు పార్టీలో మింగుడు పడటంలేదు. ఐతే అతి త్వరలోనే డి.యస్ కు తమ నాయకుడు చెక్ పెడతాడని కే.సి.ఆర్ కార్యకర్తలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: