వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ వెనక్కి తీసుకున్న జగన్.. అసలు కారణం అదేనా..?
ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గత కొన్ని నెలలుగా అక్రమాస్తుల కేసులో సిబిఐ విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకు విచారణకు హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి. 2019లో ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక... ఏపీ సీఎంగా పాలనాపరమైన విధులు నిర్వహించాల్సి ఉందని అంతే కాకుండా.. ప్రతివారం హైదరాబాద్ వచ్చేందుకు ప్రత్యేకమైన ప్రోటోకాల్ కోసం భారీగా ఖర్చు అవుతుంది అని తెలిపిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే గతంలో మొదట దాఖలు చేసిన పిటిషన్ను సిబిఐ కోర్టు కొట్టివేసింది. వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆరోపణలు రావడంతో జగన్ పిటిషన్ను కొట్టివేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు... ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సిందేనని తెలిపింది.
ఇక మొన్నటికి మొన్న మరోసారి వ్యక్తిగత హాజరు మినహాయింపుపై పిటిషన్ దాఖలు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాది. కాగా తనకు వ్యక్తిగత హాజరు పై సహాయం మినహాయింపు ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకున్నారు. పిటిషన్ లో తప్పులు దొర్లాయని పేర్కొన్న జగన్ తరపు న్యాయవాది వాటిని సరిదిద్దిన అనంతరం తిరిగి పిటిషన్ దాఖలు చేస్తామని కోర్టులో తెలిపారు.
అక్రమాస్తుల కేసులో నిన్న శుక్రవారం సందర్భంగా హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టుకు విచారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా ఆయన నిన్న కోర్టు విచారణకు హాజరుకాలేదు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో జగన్ తరపు న్యాయవాది ఆబ్సెంట్ పిటిషన్ వేశారు. కాగా జగన్ తరపు న్యాయవాది వేసిన పిటిషన్ను సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. తదుపరి విచారణను ఈ నెల 7 కు వాయిదా వేసింది సిబిఐ ప్రత్యేక కోర్టు.