అనంతపురంలో మహిళ చేతిలో పేలిన మొబైల్ ఫోన్... ఎందుకు పేలిందంటే...?
మన నిత్య జీవితంలో ఎక్కువగా వినియోగించే వస్తువులలో సెల్ ఫోన్ ఒకటి. కానీ ఆ సెల్ ఫోన్ పేలి ప్రాణాలు పోయిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. సెల్ ఫోన్ పేలి కొంతమంది గాయాలపాలవగా కొంతమంది మంది మాత్రం చనిపోయారు. తాజాగా అనంతపురం జిల్లాలోని గోరంట్ల బస్టాండ్ లో ఒక మహిళ చేతిలో ఉన్న సెల్ ఫోన్ పేలి మహిళ గాయాలపాలైంది. భారీ శబ్దంతో ఫోన్ పేలడంతో అక్కడ కొంత సమయంపాటు అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.
పూర్తి వివరాలలోకి వెళితే తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రకృతి అనే వ్యక్తి హిందూపురం వెళ్లేందుకు బస్టాండ్ కు వచ్చాడు. ప్రకృతి భార్య రష్మి ప్రకృతి సెల్ ఫోన్ తీసుకొని ఆన్ చేయగా అదే సమయంలో భారీ శబ్దంతో ఫోన్ పేలింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో అక్కడ కొంత గందరగోళం నెలకొంది. ఫోన్ పేలడంతో షాక్ అయిన మహిళ ఫోన్ ను వెంటనే కింద పడేసింది. మహిళ చేతికి తీవ్ర గాయాలు కావడంతో మహిళలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
రాత్రి అంతా మొబైల్ ఫోన్ కు ఛార్జింగ్ లో ఉంచటం వలనే మొబైల్ ఫోన్ పేలినట్టు తెలుస్తోంది. గతంలో కూడా సెల్ ఫోన్లు పేలిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా చైనాకు చెందిన మొబైల్ కంపెనీల్ ఫోన్లు గతంలో ఎన్నో పేలాయి. కొన్ని సందర్భాల్లో ఫోన్లు ఛార్జింగ్ లో ఉన్న సమయంలో పేలగా మరికొన్ని సందర్భాలలో మాత్రం ప్యాంట్ జేబులో, షర్ట్ జేబులో ఉన్న సమయంలో మొబైల్ ఫోన్లు పేలాయి.
కొన్ని స్మార్ట్ ఫోన్లు చిన్న చిన్న లోపాల కారణంగా పేలుతుండగా మరికొన్ని ఫోన్లు మాత్రం మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా పేలుతున్నాయి. లిథియం అయాన్లతో తయారైన బ్యాటరీలు ఎక్కువగా పేలుతున్నాయి. ఫోన్లతో పాటు వచ్చే ఛార్జర్ కాకుండా ఇతర ఛార్జర్లు వాడితే కూడా ఫోన్లు పేలే ప్రమాదం ఉంది. నాణ్యత లేని బ్యాటరీ వాడినా ఫోన్లు పేలుతాయి. ఈ విషయాలను గుర్తుంచుకుంటే ఫోన్లు పేలకుండా జాగ్రత్త పడవచ్చు.