తెలంగాణలో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల !

NAGARJUNA NAKKA

తెలంగాణలో మున్సిపల్ పోరు ముగిసిన కొన్ని రోజులకే  మరో ఎన్నికల సందడి మొదలయ్యింది. సహకార ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదయ్యింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంత వాతావరణలో నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. 

 

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు సహకార ఎన్నికలు జరగలేదు. ప్రస్తత పాలకమండళ్ల పదవీకాలం 2018లోనే ముగిసినా  వరుసగా నాలుగు సార్లు పొడిగించారు. కొత్త పాలకమండళ్లను ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించడంతో..ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నకలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో నియమితులైన ఎన్నికల అధికారులు ఈ నెల 6 నుంచి 8 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 9న నామినేషన్ల పరిశీలన, 10న నామినేషన్ల ఉపసంహరణతోపాటు బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఈ నెల 15న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది.

 

రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 584 మండలాలు ఉండగా 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి.  వీటిలో 18 లక్షల 42 వేల 412 మంది ఓటర్లు ఉన్నారు. లక్షకుపైగా రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని రైతులకు ఈ సారి సహకార ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కానీ... ఓటు వేసే అవకాశం లేదు. బ్యాలెట్‌ పద్దతిలో జరిగే ఈ ఎన్నికల ఫలితాలను అదేరోజు విడుదల చేస్తారు. సహకార సంఘాల డైరెక్టర్లను రైతులు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. పాత మండలాల వారీగానే సహకార సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

 

రాజకీయ పార్టీల గుర్తులతో ఈ ఎన్నికలు జరగకపోయినా ఆయా పార్టీల నేతల ప్రమేయం ఉంటుంది. ఈ మేరకు అధికార పార్టీ మున్సిపల్‌ ఎన్నికల జోష్‌లో అన్ని సహకార సంఘాలను గెలుచుకోవడానికి ప్లాన్‌ చేస్తోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా గుర్తుల పైనే నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలోనే సహకార ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలో, గుర్తులపై జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర సహకార ఎన్నికల సంఘం 24 గుర్తులను కేటాయించింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: