జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్లపై మధ్యాహ్నం విచారణ... జగన్ కు షాక్ తప్పదా...?
ఏపీ ప్రభుత్వం అమరావతి నుండి కార్యాలయాలను తరలించటంపై హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయవాదులు సుధాకర్ మరియు లక్ష్మీనారాయణ ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్లను వేశారు. మొత్తం మూడు పిటిషన్లపై హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. రాజధాని నుండి కార్యాలయాల తరలింపు కొరకు ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 13ను జారీ చేసింది. నిన్న హైకోర్టులో కార్యాలయాల తరలింపుకు వ్యతిరేకంగా ఒక పిటిషన్ దాఖలైంది.
ఈ పిటిషన్ ఈరోజు విచారణకు రానుండగా మరో రెండు పిటిషన్లు ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్లుగా దాఖలయ్యాయి. విజిలెన్స్ కమిషనర్ ఆఫీస్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆఫీస్ లను తరలిస్తున్నట్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మొత్తం మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. కార్యాలయాల తరలింపునకు సంబంధించిన మూడు పిటిషన్లు ఈరోజు విచారణకు రానుండగా
రాజధాని అంశానికి సంబంధించిన అన్ని పిటిషన్లు మాత్రం ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు ఉన్నాయి. హైకోర్టులో జగన్ నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వస్తుందో లేదో చూడాల్సి ఉంది.
గత నెల 31వ తేదీ అర్ధరాత్రి కమిషనరేట్ ఆఫ్ ఎంక్వయిరీస్ ఛైర్మన్, సభ్యుల కార్యాలయాలను, విజిలెన్స్ కమిషనర్ కార్యాలయంను అమరావతి నుండి కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. కార్యాలయ తరలింపునకు వ్యతిరేకంగా పిటిషన్లు వేసిన ముగ్గురూ లాయర్లు కావడం గమనార్హం. పిటిషన్ వేసిన వారిలో ఒకరైన గిరిధర్ రాజకీయ అజెండాతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఖజానాపై ఈ నిర్ణయం వలన భారం పడుతుందని అన్నారు.
ప్రభుత్వం రాజధానిని దురుద్దేశంతోనే తరలిస్తోందని ఆరోపణలు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 13ను రద్దు చేయాలని గిరిధర్ అభ్యర్థించారు. రాష్ట్రంలో ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్న తరువాత పాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా కేసులు నమోదు అయ్యాయని ఇలాంటి సమయంలో కార్యాలయాలకు సంబంధించిన జీవో ఇచ్చారని చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల తరువాత మూడు పిటిషన్ల గురించి విచారణ జరగనుంది.