ఎక్సైజ్ శాఖ బలోపేతం దిశగా తెలంగాణ ప్రభుత్వం !
తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక ఆదాయం అందిస్తున్న ఎక్సైజ్ శాఖ బలోపేతంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆ శాఖలో ఉన్న సిబ్బంది కొరతకు చెక్ పెట్టేందుకు భారీగా రిక్రూట్ మెంట్ చేపట్టింది. మూసధోరణిలో కాకుండా ప్రత్యేకమైన పద్దతుల్లో కొత్త బ్యాచ్‌కు ట్రైనింగ్ ఇచ్చి త్వరలోనే పోస్టింగ్ ఇవ్వనున్నారు. మొత్తం 284 మంది ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు త్వరలోనే శాఖలో చేరనున్నారు.
తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలని భావిస్తున్న ప్రభుత్వం...ఆ దిశగా ఎక్సైజ్ శాఖ బలోపేతంపై దృష్టి పెట్టింది. పెద్ద ఎత్తున ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ల నియామక ప్రక్రియను పూర్తి చేసి ట్రైనింగ్ కూడా ప్రారంభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012లో జరిగిన రిక్రూట్ మెంట్ తర్వాత ఎక్సైజ్ శాఖలో ఎలాంటి నియామకాలు జరుగకపోవడంతో ఖాళీగా ఉన్న 284 పోస్టులను భర్తీ చేసింది.
ఎక్సైజ్ శాఖ అంటే కేవలం మద్యం అమ్మకాలు, వాటి నియంత్రణ మాత్రమే కాదు.. సమాజంలో జరిగే ఇతర నేరాలకు సంబంధించిన అంశాలలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా డ్రగ్స్ అమ్మకాల కట్టడిలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పాత్ర ముఖ్యమైనది. దీంతో పాటు కల్తీ కల్లును అరికట్టడం, కల్లుగీత కార్మికాలను ప్రోత్సహిస్తుంది.
ఎక్సైజ్ శాఖ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో రిక్రూట్‌మెంట్ జరగడం ఇదే తొలిసారి. నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి...వారికి ట్రైనింగ్ మొదలు పెట్టారు. అయితే మూసధోరణిలో ఉండే ట్రైనింగ్ కాకుండా ఫిజికల్ ఫిట్‌నెస్‌తో పాటూ ఫీల్డ్ లెవల్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. 4 నెలల పాటు ఉండే ట్రైనింగ్‌లో ఫీల్డ్‌కు వెళ్లడం అక్కడ తాము నేర్చుకున్న వాటిని తిరిగి ట్రైనింగ్ సెంటర్‌కు వచ్చి చర్చించనున్నారు.
ఎక్సైజ్ ఎస్సైల ట్రైనింగ్ కార్యక్రమానికి ఆ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. విధుల్లో సిన్సియారిటీ చూపించాలని, అవినీతికి తావులేకుండా డ్యూటీ చేయాలని ఆయన సూచించారు. నిజాయితీ, కమిట్‌మెంట్‌తో పనిచేయడంతో పాటు సామాజిక కోణంలో ఆలోచించాలని సూచించారు. రాష్ట్రానికి అత్యధిక ఆదాయం అందిస్తున్న ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్నందుకు చాలా గొప్ప విషయంగా భావించాలని ట్రైనీలకు సూచించారు సీఎస్ సోమేష్ కుమార్. ఈ బ్యాచ్‌కు ఇచ్చే ట్రైనింగ్ హిస్టారికల్‌గా ఉంటుందన్నారు. ట్రైనింగ్ మొదలైన 284 మంది ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ల బ్యాచ్‌లో 100 మంది మహిళ ఎస్‌ఐలు ఉన్నారు.. వీరంతా మరో నాలుగు నెలల్లో తమ శిక్షణను పూర్తి చేసుకొని విధి నిర్వాహణలో చేరబోతున్నారు.