తిరుమల కొండపై మరోసారి విమానం హల్ చల్ !
తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టడం కలకలంరేపింది. రెండు రోజులుగా విమానం ఆలయం మీదుగా వెళ్లడంతో విజిలెన్స్ అధికారులు, భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందని ఆరా తీసేందుకు.. చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. మరోవైపు తిరుమలను నో ప్లై జోన్ గా ప్రకటించాలని టీటీడీ చేస్తున్న విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోవడం లేదు.
తిరుమల కొండపై మరోసారి విమానం హల్ చల్ చేసింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలపై సర్వే ఆఫ్ ఇండియా ఛార్టర్డ్ విమానం రెండు రోజులుగా చక్కర్లుకొడుతోంది. ఐదేళ్లకోసారి విమానాల ద్వారా దేశ భౌగోళిక పరిస్థితులను ఎస్ ఓ ఐ సర్వే చేయిస్తుంది. ఈ విమానమే ఇప్పుడు తిరుమలలో ఆందోళనకు కారణమైంది.
అయితే ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి విమాన వేంకటేశ్వరస్వామికి ఎగువన విమానాలు వెళ్లకూడదనే నియమం ఉంది. దీనిపై గతంలోనూ ఏవియేషన్ ఆఫ్ ఇండియాకు తిరుమల తిరుపతి దేవస్థానం ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం రెండు రోజులుగా తిరుమలపై విమానం ఎగరడాన్ని గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు.. చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు ఫిర్యాదు చేశారు.
నిజానికి తిరుమలను నో ప్లయింగ్ జోన్ గా ప్రకటించాలని చాలా కాలంగా డిమాండ్లున్నాయి. ఓ దశలో అలాంటి ప్రకటన వస్తుందని కూడా భావించారు. కానీ, ఈ లోపు తిరుమల ఎయిర్ పోర్ట్ అభివృద్ధి చెందటం అడ్డంకిగా మారింది. అదే సమయంలో ఒక్క తిరుమలకు ఇలాంటి వెసులుబాటు ఇస్తే, ఇతర ఆలయాలనుంచి కూడా డిమాండ్లు వచ్చే అవకాశాలుంటాయనే అభిప్రాయాలు కూడా వినిపించాయి.
దీంతో నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించనప్పటికీ, చెన్నై ఏటీసీ ద్వారా వీలైనంత వరకు తిరుమల మీదుగా విమానాలు రాకుండా చూసేలా అనధికారిక హామీ తీసుకున్నారు. అయితే, తిరుమలపై నుంచి విమానాలు తిరగటం నిబంధనలకు విరుద్ధం మాత్రం కాదు. మరోపక్క ఆగమశాస్త్రం ప్రకారం విమానాలు కొండపై తిరగరాదని టీటీడీ అధికారులు చెబుతున్నారు. తిరుమల కొండపై దేవతలు విహరిస్తుంటారని... అందుకే ఆ ప్రాంతంలో విమానాలు నిషేధమంటున్నారు పండితులు. మొత్తానికి తిరుమలపై అరుదుగా ఎగిరే విమానాలు భక్తుల ఆందోళనకు కారణమవుతున్నాయి.