ఇదేం ట్విస్టు: తెరపైకి సినీ రాజధాని.. దాని కథ కమిష్ ఏమిటి..?
విశాఖలో షూటింగులు ఎక్కువగా జరుగుతాయి. అది ఇవాళా నిన్నా ముచ్చట కాదు, 1960 దశకం నుంచి అది మొదలైంది. స్వర్ణయుగం నటుడు అక్కినేని నాగేశ్వరరావు కులగోత్రాలు సినిమాతో విశాఖ అందాలు వెండితెరను పరచుకున్నాయి. ఆ తరువాత ఎందరో విశాఖ సోయగాలతో సొమ్ము చేసుకున్నారు. 1990 దశకంలో చెన్నై నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ షిఫ్ట్అ వుతుందన్నపుడు కూడా విశాఖ పేరు గట్టిగా వినిపించింది. అయితే హైదరాబాద్ లోనే చివరికి సెటిల్ అయింది. విభజన తరువాత మళ్ళీ విశాఖకు టాలీవుడ్ అంటూ గట్టిగానే ప్రచారం సాగినా బడా నిర్మాతలు, పెద్దలు హైదరాబాదే ముద్దు అంటూ వచ్చారు. విశాఖలో సినిమా ఫంక్షన్లు ఎక్కువగానే జరుగుతాయి. ఇలా ఫంక్షన్లు జరిగిన ప్రతీసారీ విశాఖకు చిత్ర పరిశ్రమను తెచ్చేస్తామని సినీ పెద్దలు ప్రకటనలు చేస్తారు. విశాఖకు పరిశ్రమ వస్తే అన్నీ దగ్గరుండి చేస్తామని రాజకీయ పెద్దలో ఆర్భాటం చేస్తారు. అంతటితోనే ఆ ముచ్చట అలా ముగిసిపోతోంది. నిజానికి విశాఖ అందాల మీద ప్రేమా... లేక ఇక్కడ భూముల మీద మోజా ... కాదంటే ఇక్కడ జనం అమాయకత్వం మీద అతి నమ్మకమా అన్నది తెలియదు కానీ విశాఖకు సినీ పరిశ్రమ రాదూ, రాలేదూ అన్నది మాత్రం తేలిపోతోంది.