ఈ 8 నెలల్లో జగన్.. జనానికి పంచిన పెట్టిన డబ్బెంతో తెలుసా..? దిమ్మతిరగాల్సిందే..!

Chakravarthi Kalyan
వైఎస్ జగన్ సీఎం అయినప్పటి నుంచి జనంపై వరాల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు. ఎన్నికల్లో చెప్పనివీ కూడా కొన్ని చేస్తున్నారు. మొత్తం మీద.. సంక్షేమం పేరిట జగన్ వేల కోట్ల రూపాయలు ప్రజలకు పంచి పెట్టారు. ఇప్పుడు ఈ లెక్కలు ఆశ్చర్యపరుస్తున్నాయి. అవును మరి.. ఈ 8 నెలల్లో జగన్ సర్కారు దాదాపు 15 వేల కోట్ల రూపాయలు ప్రజలకు పంచి పెట్టింది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలల్లోనే ప్రజా సంక్షేమంపై వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనదైన ముద్ర వేశారు. కోటిన్నరకుపైగా పేద, సాధారణ కుటుంబాల ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం రూ.14,795.21 కోట్లు ఆర్థిక సహాయం రూపంలో అందజేశారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా ఇచ్చిన మాటకు కట్టుబడే ముఖ్యమంత్రిగా నిలిచారు.

ఎనిమిది నెలల కాలంలోనే మేనిఫెస్టోలోని సింహ భాగం హామీలను అమలు చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌కే దక్కుతుంది. ఈ పథకాలను ప్రజా ఆకర్షక పథకాలుగా చూడకూడదని, ప్రధానంగా వైయస్‌ఆర్‌ రైతు భరోసా, అమ్మ ఒడి పథకాల వెనుక బహుళ ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు పంటల పెట్టుబడి కోసం రైతు భరోసా పథకం అమలు చేయడం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే అంటున్నారు నిపుణులు. షుమారు 46,50,846 మంది రైతుల ఖాతాలకు నగదు జమ చేశారు.

ఇక అమ్మఒడి పథకం అమల్లో సామాజిక కోణం స్పష్టంగా కనిపిస్తోంది. పేద పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను పనులకు కాకుండా బడికి పంపించేందుకు అమ్మఒడి పథకం ప్రారంభించారు. తమ పిల్లలను బడికి పంపించే తల్లులకు ఈ పథకం కింద ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇచ్చారు. అమ్మఒడికి లబ్ధిదారులను పారదర్శకంగా.. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఎంపిక చేయడమే కాకుండా అవినీతికి ఆస్కారం లేకుండా ఏకంగా 42,01,621 మంది తల్లుల ఖాతాలకు నగదు జమ చేశారు. ఇలా వివిధ పథకాల కింద 8 నెలల పాలనా కాలంలో జగన్ దాదాపు 15 వేల కోట్ల రూపాయలు ప్రజలకు పంచి పెట్టేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: