మేడారంలో భక్తులను మోసం చేస్తున్న వ్యాపారులు... పట్టించుకోని అధికారులు...?

Reddy P Rajasekhar

మేడారం జాతరలో వ్యాపారులు భక్తులను నిలువునా మోసం చేస్తున్నారు. ప్రతి వస్తువును వస్తువు అసలు ధర కంటే రెండు రెట్లు ఎక్కువగా విక్రయిస్తున్నారు. భక్తులు తప్పనిసరి పరిస్థితులలో అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిసినా ఏమీ చేయలేక తమ జేబులను ఖాళీ చేసుకుంటున్నారు. ఈ వస్తువూ ఆ వస్తువూ అని తేడా లేకుండా నిత్యావసర వస్తువులతో పాటు మద్యం మరియు మాంసాన్ని కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నారు.       
 
వ్యాపారులు ధరలతో మేడారం జాతరకు వచ్చే భక్తులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. భక్తులు ఇంటి నుండి తెచ్చుకోవడం ఎందుకని జాతరలో వస్తువులను కొనుగోలు చేద్దామని భావిస్తే రెండు రెట్లు, మూడు రెట్లు పెంచి చెబుతూ ఉండటంతో షాక్ అవ్వడం భక్తుల వంతవుతోంది. మద్యం, బెల్లం, కొబ్బరికాయల విక్రయం కోసం లక్షలు వెచ్చించి టెండర్లు దక్కించుకున్న వ్యాపారులు లాభార్జన కోసం భారీగా రేట్లు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. 
 
మేడారం జాతరలో కిలో కోడి మాంసం 500 రూపాయలు పలుకుతోంటే మేక మాంసం 1000 రూపాయలకు పైగా పలుకుతోంది. సాధారణంగా ఒక బీరు అసలు ధర 120 రూపాయలు ఉండగా ఆ బీరు బాటిల్ ను 220 రూపాయలకు విక్రయిస్తూ ఉండటం గమనార్హం. ఆఖరికి కొబ్బరికాయ, పూజాసామాగ్రి ధరలు కూడా పెంచి అమ్ముతూ ఉండటంతో భక్తుల నుండి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 
 
సాధారణంగా ఒక కొబ్బరికాయను 15 నుండి 20 రూపాయలకు విక్రయించాల్సి ఉండగా 60 రూపాయల నుండి 80 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. కొబ్బరికాయల పరిమాణం కూడా చిన్నగా ఉందని భక్తులు చెబుతున్నారు. పిల్లల ఆట వస్తువుల ధరలను మూడు రెట్లు పెంచి చెబుతూ ఉండటంతో భక్తులు కొనుగోలు చేయకుండానే తిరుగుప్రయాణమవుతున్నారు. అధికారులు చొరవ తీసుకోవాలని రేట్లు తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: