కర్ణాటకలో ఆంధ్ర బస్సులపై రాళ్ల దాడి... 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని బంద్ కు పిలుపు...?

Reddy P Rajasekhar

కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న బంద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కర్ణాటకలో ఈరోజు రేపు కన్నడ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. మంగళూరు సమీపంలో ఆంధ్ర బస్సులపై బంద్ లో పాల్గొన్నవారు రాళ్లు రువ్వారు. ప్రభుత్వం స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 
 
కర్ణాటకలో నిర్వహిస్తున్న బంద్ మాత్రం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోందని సమాచారం అందుతోంది. కర్ణాటక రాష్ట్రంలో స్థానికేతరులకు పెద్దపీట వేస్తున్నారని అందువలన స్థానికులకు ఉద్యోగవకాశాలు లభించటం లేదని కన్నడ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. కర్ణాటక రాష్ట్రంలోని చాలా జిల్లాలలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నా రెండు జిల్లాలలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
హసన్, బళ్లారి జిల్లాలలో పూర్తిగా బంద్ ప్రభావం కనిపిస్తోంది. ఈ రెండు జిల్లాలలో ప్రజారవాణా స్తంభించిపోవడంతో పాటు దుకాణాలు కూడా మూతబడ్డాయి. బంద్ సందర్భంగా అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మంగళూరు సమీపంలో ఆంధ్ర బస్సులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వటంతో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. 
 
సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో మాత్రం పెద్దగా బంద్ ప్రభావం కనిపించకపోవడం గమనార్హం. ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఈరోజు, రేపు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. హసన్, బళ్లారి జిల్లాలలో మాత్రం బంద్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోందని తెలుస్తోంది. ఈ బంద్ కు 600 సంఘ సంస్థలు మద్దతునిచ్చాయి. కర్ణాటకలో అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు బంద్ కు తమ మద్దతు ఉందా... లేదా...? అనే విషయాన్ని మాత్రం ప్రకటన చేయలేదు. మరోవైపు బంద్ కు హోటల్ సంఘాలు మాత్రo మద్దతు ఇవ్వకపోవడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: