ట్విట్టర్ కి షాక్.. వార్నింగ్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు...!

Suma Kallamadi

గతేడాది నవంబరు 27న రాత్రి శంషాబాద్ వద్ద దిశను నలుగురు అపహరించి, అత్యాచారం చేసి, ఆపై హత్య చేశారు. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి గ్రామ శివారు రోడ్డు వంతెన దగ్గర అదే రోజు రాత్రి ఆమెను పెట్రోల్ పోసి తగలబెట్టారు. నవంబరు 28 తెల్లవారుజామున పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఆమె మృతదేహం కనిపించింది.

 

 

తోడుంపల్లి వద్ద దిశపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను 48 గంటల్లో పట్టుకున్న పోలీసులు... వారిని కోర్టుకు అప్పగించగా కోర్టు వారికి 14 రోజులపాటు రిమాండ్ విధించింది. అయితే, నిందితులను వెంటనే ఉరి తీయాలని, లేదంటే ఎన్ కౌంటర్ చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, పోలీసులు చట్టప్రకారం శిక్ష పడేలా చేస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో షాద్ నగర్ కోర్టు నుంచి పోలీసులు తమ కష్టడికి తీసుకుని, చటాన్‌పల్లి వద్ద సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో పోలీసులపై దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో వేరే దారి లేక వారిని కాల్చి చంపినట్టు పోలీసులు వెల్లడించారు.

 

 

దిశ హత్యాచారం కేసులో ఆమె పేరు, ఫోటోలు సహా వివరాలను బహిర్గతం చేసినందుకు మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఈ పిల్‌ పై బుధవారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. ఇందులో ప్రతివాదులుగా పేర్కొన్న ట్విట్టర్‌‌ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్‌పై స్పందన తెలియచేయకపోతే రూ.10 లక్షల జరిమానా విధిస్తామని ట్విట్టర్‌ను హెచ్చరించింది. 

 

 


ఇటీవల అత్యాచారానికి గురైన ఓ మైనర్ బాధితురాలి వివరాలను బహిర్గతం చేసినందుకు మీడియా సంస్థలపై హైకోర్టు రూ.10 లక్షల జరిమానా విధించిందని, ప్రస్తుతం మరోసారి దానిని పునరావృతం చేయకుండా ఉండాలంటే సమాధానం ఇవ్వాలని హెచ్చరించారు. నాలుగు వారాల్లోగా అఫిడ్‌విట్ దాఖలుచేయాలని ఆదేశించిన ధర్మాసనం.. విచారణను మే 4కి వాయిదా వేసింది. హత్యాచారానికి గురైన హైదరాబాద్ యువ వైద్యురాలి వివరాలను బహిర్గతం చేసి మీడియా సంస్థలు, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో లాయర్ యశ్‌దీప్ చహల్ పిల్ దాఖలు చేశారు.

 

 

అత్యాచారం సహా ఇలాంటి ఘటనల్లో బాధితుల వివరాలను వెల్లడించడం ఐపీసీ సెక్షన్ 228ఎ ప్రకారం శిక్షార్హమైన నేరం. ఇలా చేస్తే రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది. దిశ కేసులోనూ మీడియా సంస్థలు, సోషల్ మీడియ వేదికలు ఐపీసీ సెక్షన్ 228ఏ ఉల్లంఘించాయని ఆయన తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: