బి అలర్ట్: ఓ ఫేసుబుక్ రిక్వెస్టుని యాక్సెప్ట్ చేసి ప్రాణాలు కోల్పోయిన రాగసుధ..!
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వెంకటరమణ కాలనీకి చెందిన రాగసుధ(29) డిగ్రీ చదువుకుంది. అయితే ఆమె డిగ్రీ చదివే రోజుల్లో కార్తీక్ అనే ఒక యువకుడు తనని ప్రేమిస్తున్నానంటూ ఆమె వెనుక తిరగని రోజంటూ లేదు. కానీ రాగసుధ మాత్రం అతడిని పట్టించుకోకుండా తన ధ్యాసంతా చదువు మీద పెట్టి తన డిగ్రీ చదువు పూర్తి చేసుకొని 2011లో బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఉదయ్ కుమార్ ని పెళ్లాడి ఒక బిడ్డకి జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ కొడుకు రోహిత్ కు ఐదేళ్ళు నిండాయి.
గత ఎనిమిదేళ్లుగా రాగసుధ కుటుంబంలో ఏ చింతా లేకుండా వారి జీవితాలు సాఫీగా సాగిపోతున్నాయి. కానీ ఒక సంవత్సరం క్రితం రాగసుధకు కార్తీక్ నుండి ఫేసుబుక్ రిక్వెస్ట్ వచ్చింది. అతడిని గుర్తుపట్టిన రాగసుధ 'నాకు ఆల్రెడీ వివాహమైంది. నా వెంట పడడులే. మాట్లాడితే ఏం కాదులే' అనుకుంటూ ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసింది. తరువాత వీళ్ళిద్దరూ చాటింగ్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే కార్తీక్ స్నేహితుడైన రవి కూడా రాగసుధతో చాటింగు చేయడం స్టార్ట్ చేశాడు. అయితే, సమయం గడిచిన కొద్దీ కార్తీక్ మాట్లాడే విధానం మారిపోయింది. ఒకానొక రోజు 'రాగసుధ, నాకు నీకు ఎఫైర్ నడుస్తుందని మీ భర్తకు చెబుతాను' అని అన్నాడు. దాంతో ఒక్కసారిగా షాకైన ఆమె... 'మన మధ్య ఏ ఎఫైర్ లేదు కదా ఏమని చెప్తావ్?' అని ప్రశ్నించింది. ఏదో ఒకటి చెప్పి మీ భర్తని నమ్మిస్తాను. అప్పుడు ఆయన నిన్ను వదిలేస్తాడు. అప్పుడు నీకు నేనే దిక్కు' అని బెదిరించాడు.
అలా చెప్పకుండా ఉండాలంటే నేనేం చేయాలి అని రాగసుధ ప్రశ్నించగా... 'నేను అడిగినన్ని డబ్బులివ్వాలి' అని కార్తీక్ సమాధానమిచ్చాడు. దీంతో రాగసుధ అతడికి డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇలా గత ఏడాదిగా కార్తీక్ బ్లాక్మెయిల్ చేస్తూ రూ.లక్ష వరకు ఆమె నుండి వసూలు చేశాడు. అయితే, శుక్రవారం రోజు రాగసుధ తన మామయ్యతో కొడుకుని పాఠశాలకు తీసుకెళ్లమని చెప్పి బయటికి పంపించేసింది. తరువాత చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కార్తీక్ రాగసుధ కంటే ముందుగానే చనిపోయాడు. నిజం చెప్పాలంటే రాగసుధ కారణంగానే కార్తీక్ హత్య చేయబడ్డాడు. ఎలా అంటే... కార్తీక్ స్నేహితుడు రవితో కార్తీక్ బ్లాక్మెయిల్ చేసి తనని డబ్బులు అడుగుతున్నాడని రాగసుధ చెప్పింది. దాంతో అతడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆ కోపంలోనే కార్తీక్ ని లేపేయాలని నిశ్చయించుకున్నాడు. నలుగురు సుపారీలను మాట్లాడి పక్కా ప్లాన్ ప్రకారం మర్డర్ స్కెచ్ రూపొందించుకున్నాడు. బుధవారం రోజు పార్టీ ఇస్తానంటూ నమ్మబలికి కార్తీక్ ని గద్వాలకు 8కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపల్లి గుట్టల దగ్గరకు తీసుకెళ్లాడు.
అక్కడ ఆల్రెడీ కాపుకాసిన నలుగురు సుఫారీలు కార్తీక్ కనిపించగానే అతడిపై దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత రవి పోలీస్ స్టేషనుకు వెళ్లి లొంగిపోయాడు. ఈ తతంగమంతా జరిగిన తర్వాత పోలీసుల నుండి రాగసుధ అమ్మానాన్నలకు ఫోన్ వచ్చింది. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులు రాగసుధకి చెప్పే సరికి... ఇక పోలీసులు తన ఇంటికి వచ్చి తనను అరెస్టు చేస్తారని భయబ్రాంతులకు గురైన రాగసుధ ఉరి వేసుకుని చనిపోయింది. అయితే సైడ్ లెటర్లో 'నేను ఆత్మహత్య చేసుకుంటున్నా. నా కొడుకును బాగా చూసుకోండి. నేనే తప్పు చేయలేదు. నన్ను అందరూ క్షమించండి’ అని రాసి ఉంది. అయితే కార్తీక్ కేసుని విచారించేందుకు సిద్ధమవుతుండగా రాగసుధ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనా కేవలం ఒకేఒక్క ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడం వలన ఇద్దరు మరణించడంతో పాటు ఒక వ్యక్తి జీవితం జైలు పాలయింది. అందుకే అడ్డమైన వారితో అస్సలు స్నేహం చేయకూడదని పెద్దలు చెబుతారు.